JNU కేసులో ట్విస్ట్ : దెబ్బలుతిని రక్తమోడుతూ హాస్పటల్ లో చేరిన స్టూడెంట్ లీడర్ పై రెండు కేసులు నమోదు

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 09:53 AM IST
JNU కేసులో ట్విస్ట్ : దెబ్బలుతిని రక్తమోడుతూ హాస్పటల్ లో చేరిన స్టూడెంట్ లీడర్ పై రెండు కేసులు నమోదు

ఢిల్లీలోని జేఎన్‌యూలో విధ్వంసకాండ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ  హింసాకాండలో తీవ్రంగా గాయపడి.. ఎయిమ్స్ లో చికిత్స పొందిన బాధితురాలైన, జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలైన ఐషే ఘోష్ తో పాటు మరో 19 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనం రేపింది. దెబ్బలుతిని రక్తమోడుతూ హాస్పటల్ లో చేరిన స్టూడెంట్ లీడర్ ఐషే ఘోషే పై రెండు కేసులు నమోదు చేశారు. 

జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలైన ఐషే ఘోష్ యూనివర్శిటీలోని సర్వర్ రూంతోపాటు వర్శిటీ సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిందని వర్శిటీ యాజమాన్యం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐషే ఘోష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముసుగులు ధరించిన 50 మందికి పైగా దుండగులు వర్సిటీ ప్రాంగణంలోని సబర్మతి, మహిమాండ్వి, పెరియార్‌ హాస్టళ్లలోకి చొరబడి లాఠీలు, రాడ్లు, సుత్తులతో విధ్వంసం సృష్టించి, అధ్యాపకులపై, విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిలో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ తల పగిలింది. ఆమె ముఖం నుంచి రక్తం తీవ్రంగా స్రవించింది. ఈ ఘటనలో 30మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశార్జ్ అయ్యారు.

 
ఈ ఘటనకు ముందు రోజు అంటే జనవరి 4వతేదీన ఐషే ఘోష్ తోపాటు 19 మంది సర్వర్ రూంపై దాడి చేసి సెక్యూరిటీ గార్డులను కొట్టారని యూనివర్శిటీ అధికారులు ఫిర్యాదు చేశారు. దాడిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు గాయపడినా వర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎం జగదీష్ కుమార్ కనీసం పరామర్శించలేదని, వీసీ రాజీనామా చేయాలని ఐషేఘోష్ డిమాండ్ చేశారు.

హాస్టల్ ఫీజు పెంపుకు వ్యతిరేకంగా విద్యార్ధుల ఉద్యమానికి భంగం కలిగించటానికి వర్శిటీ యాజమాన్యం ఇటువంటి కేసులు పెడుతోందని ఘోష్ విమర్శించారు. 
క్యాంపస్‌లోకి ప్రవేశించిన గుంపు సమీప పోలీసు స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ, ఇతర సీనియర్ ఆఫీసర్లు, జెఎన్‌యు భద్రతా సిబ్బందిని సంప్రదించారని ఘోష్ ఆరోపించారు. 

అలా క్యాంపస్ లోకి వచ్చిన గుంపు మాపై దాడి చేసేందుకు యత్నించే క్రమంలో ఆగి ఉన్న కారును ధ్వంసం చేశారనీ..ఈ దాడి నుంచి నా సోదరి తప్పించుకోగలిగింది..కాని నేను నా ఫ్రెండ్స్ దుండగులకు పట్టుబడటంతో వారు నాపై దాడి చేసిన కాళ్లతో ఇష్టమొచ్చినట్లుగా తన్నారనీ..ఓ రాడ్ తో నా తలపై కొట్టారు. గాయపడిన తమపైనే కేసులు పెట్టటంపై బాధితులు  ఆవేదన వ్యక్తంచేశారు.