రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

Delhi Police notices to farmers’ union leaders : కిసాన్ గణతంత్ర పరేడ్ లో హింసపై రైతు సంఘాల నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఘజిపూర్ సరిహద్దు వద్ద భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి నోటీసులు అంటించారు. ఢిల్లీ పోలీసులు మూడు పేజీల నోటీసుల్లో 11 అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ యుపి ఘజిపూర్ సరిహద్ధులోని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు.

ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు ఇచ్చిన అనుమతులు, షరతులు పాటించకపోవడంపై, చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 37 రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో పెట్టారు. కిసాన్ పరేడ్‌లో 394 మంది పోలీసులు గాయపడ్డారు. కుట్రలో భాగంగానే హింస చోటు చేసుకుందని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. కిసాన్‌ రిపబ్లిక్ పరేడ్‌లో హింసాత్మక ఘటనల కేసుల్లో 19మంది నిందితులను అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పారు. 25కు పైగా క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు.

మరోవైపు రైతు సంఘాల్లో చీలిక రావడంతో కొందరు ఆందోళన విరమించారు. టెంట్లు తీసేసి చిల్లా సరిహద్దులను రైతులు ఖాళీ చేశారు. నిన్నటిదాకా రైతుల ఆందోళనలతో నిండిపోయిన ప్రాంతమంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. పోలీసుల బారికేడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో యూపీ-నోయిడా నుంచి ఢిల్లీ వైపు రాకపోకలు అనుమతిస్తున్నారు. టిక్రి సరిహద్దుల్లో మాత్రం రైతుల ఆందోళన కొనసాగుతోంది.