ఢిల్లీలో రైతుల పోరాటం : 15 అడుగుల గోడపై నుంచి దూకిన పోలీసులు, వీడియో వైరల్

ఢిల్లీలో రైతుల పోరాటం : 15 అడుగుల గోడపై నుంచి దూకిన పోలీసులు, వీడియో వైరల్

Farmers’ struggle in Delhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు కదం తొక్కుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపడుతున్నఈ ఆందోళన హింసాత్మకంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన రైతు సంఘాలు..ఎర్రకోట వద్దకు అనూహ్యంగా చేరుకున్నాయి. వారిని అడ్డుకోవడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. కానీ..పోలీసుల చర్యలను రైతులు తిప్పికొట్టారు.

పలు ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించడంతో వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు కర్రలతో పోలీసుల వెంబడి పట్టారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పోలీసులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో జరిగిన హింసాత్మక వాతావరణానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.  ఎర్రకోట సమీపంలో బారికేడ్లను తొలగించి..రైతులు ముందుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు 15 అడుగుల పైనున్న గోడపై ఉన్నారు. వీరిపై రైతులు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో తమను తాము రక్షించుకోనేందుకు…అంత ఎత్తున్న గోడపై నుంచి అమాంతం కిందకు దూకేశారు. ఒక్కొక్కరు కింద పడుతున్న దృశ్యాలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది.

రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌తో రణరంగంగా మారిన ఢిల్లీలో ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఢిల్లీ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట దగ్గర భారీగా బలగాలను మోహరించారు. టిక్రి సరిహద్దుల్లో రైతులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ కూడా భారీగా భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్, నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వేలాదిగా వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఘాజీపూర్‌ -ఆనంద్ విహార్ మార్గంలోనూ వాహనాలు బారులు తీరాయి. ఈ దృశ్యం చీమల దండులా కనిపిస్తోంది.