నిజాముద్దీన్ ఘటన : మతపెద్దలను ముందే హెచ్చరించిన ఢిల్లీ పోలీసుల వీడియో వెలుగులోకి

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 08:21 AM IST
నిజాముద్దీన్ ఘటన : మతపెద్దలను ముందే హెచ్చరించిన ఢిల్లీ పోలీసుల వీడియో వెలుగులోకి

ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 25మంది ఢిల్లీ కరోనా పాజిటివ్ రాగా, 617 మందికి కరోనా లక్షణాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఢిల్లీలోని ఐదు ఆసులత్రులకు తరలించారు. మర్కజ్ భవనం నుంచి 2361 మందిని తరలించారు. 17 వందల మందిని స్వీయ నిర్బందానికి తరలించారు.

నిజాముద్దీన్ ఈవెంట్ కు వెళ్లిన వారిలో తమిళనాడు లో 50,ఢిల్లీలో 24,తెలంగాణా లో 21,ఆంధ్రప్రదేశ్ లో 18,అండమాన్ లో10 ,అస్సాం,జమ్మూ కాశ్మీర్ లో ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. తబ్లీగి జమాత్ తో సంబంధం ఉన్న 824 విదేశీయుల వివరాలను ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ పంపించింది. 36గంటలపాటు సాగిన నిజాముద్దీన్ ఆపరేషన్ లో పాల్గొన్న ఢిల్లీ పోలీసులకు అధికారులను అభినందించారు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.

అయితే కరోనా వైరస్ నేపథ్యంలో గుంపులుగా ఉండకూడదు అని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కరోనా నేపథ్యంలో మర్కజ్ నిర్వాహకులను మార్చి-23నే ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ముందుగానే మతపెద్దలకు కరోనా పరిస్థితులను ఢిల్లీ పోలీసులు వివరించారు. ప్రార్థనా మందిరాల్లో,మసీదుల్లో 5గురు కంటే ఎక్కువమంది ఉండటానికి వీల్లేదన్న ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలు గురించి,ఎపిడమిక్ యాక్ట్ గురించి మతపెద్దలకు పోలీసులు వివరించారు.

ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని కరోనా అలర్ట్ కారణంగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని మతపెద్దలను ఆదేశించారు. పెద్ద ఎత్తున సమూహంగా మసీదుల్లో ఉండటానికి వీల్లేదని మార్చి-23,2020న మతపెద్దలకు నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ హెచ్చరించిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మతపెద్దలు పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెట్టడం వల్లే ఇప్పుడు దేశవ్యాప్త ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం ఢిల్లీలో 16మసీదుల్లో 170మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. మరోవైపు మర్కజ్ బిల్డింగ్ ను ఇవాళ శానిటైజ్ చేశారు.