ఢిల్లీ వెళ్లే వారికి ముఖ్య గమనిక, ప్రభుత్వం కొత్త నిబంధన

ఢిల్లీ వెళ్లే వారికి ముఖ్య గమనిక, ప్రభుత్వం కొత్త నిబంధన

delhi says Negative covid report to be mandatory: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. అక్కడ కేసులు గణనీయంగా పెరిగాయి. మరోమారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఢిల్లీలోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగిటివ్ రిపోర్టు మస్ట్ అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముఖ్యంగా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదు రాష్ట్రాలు(మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, పంజాబ్) నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధన వర్తిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం తెలింది. ఢిల్లీలోకి ఎంటర్ అవ్వాలంటే కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 26వ నుంచి మార్చి 15 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.

దీని ప్రకారం ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చినట్లు చూపించాల్సి ఉంటుంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతవారం 86 శాతం కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. దీనికి కారణం ఈ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చినవారేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు నెగెటివ్‌ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేసింది.

మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అక్కడి నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదే విధంగా మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు కూడా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించాయి. అక్కడి నుంచి వచ్చేవారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం మరోమారు లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ వచ్చిందనే ధీమానో లేక కరోనా వైరస్ అంతమైందనే ఓవర్ కాన్ఫిడెన్సో.. కారణం తెలీదు కానీ, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్లే మరోసారి కరోనా కేసులు పెరగడానికి కారణమైందని డాక్టర్లు చెబుతున్నారు. ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.