“బాబా కా దాబా” బ్రాండ్ న్యూ రెస్టారెంట్ చూశారా

“బాబా కా దాబా” బ్రాండ్ న్యూ రెస్టారెంట్ చూశారా

Baba Ka Dhaba Owner సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతి ప్రసాద్​ (80), బదామి దేవి..ఇవాళ(డిసెంబర్-21,2020) న్యూఢిల్లీలోని మాల్వియా నగర్ లో కొత్త రెస్టారెంట్​ను ప్రారంభించారు. నాలుగు నెలల క్రితం కాంతా ప్రసాద్​ వీడియో వైరల్ ​గా మారిన క్రమంలో పలువురు దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాతల సాయంలో కొత్త రెస్టారెంట్ ని ప్రారంభించారు కాంతి ప్రసాద్. ఇప్పటి వరకు సుమారు రూ.40 లక్షల వరకు సాయం అందినట్లు తెలుస్తోంది. అలాగే.. కొత్త హోటల్​కు కావాల్సిన నాలుగు టెబుళ్లు, 16 కుర్చీలు సమకూర్చారు. దాదాపు రెండు నెలల క్రితం వరకు దాల్,కర్రీ,పరాఠాలు,రైస్ ని ప్లేట్ 30-50 రూపాయలకు అమ్మిన అదే ప్రాంతంలోనే ఇప్పుడు బ్రాండ్ న్యూ రెస్టారెంట్ ని ప్రారంభించారు కాంతి ప్రసాద్ దంపతులు.

అయితే, 30 ఏళ్ల నుంచి ఢిల్లీలోని మాల్వియా నగర్​లో ‘బాబా కా దాబా’ పేరుతో చిన్న బండిలో ఆహార పదార్థాలు అమ్ముకుంటూ కాంతి ప్రసాద్ దంపతులు జీవనం సాగిస్తున్న సమయంలో కరోనా సంక్షోభం వారిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీకి చెందిన గౌర‌వ్ వాస‌న్ అనే ఫుడ్ బ్లాగ‌ర్… బాబా కా దాబా లో రోటీ త‌యారు చేస్తున్న కాంతి ప్ర‌సాద్ ను.. ఏం తాత ఎలా ఉన్నావ్… బిజినెస్ ఎలా న‌డుస్తుంది అంటూ వారితో మాట క‌లిపాడు. మాట్లాడుతూనే వాళ్లు చేసిన ఫుడ్ ఐట‌మ్స్ అన్నీ టేస్ట్ చేశాడు. చాలా బాగున్నాయి.

దీంతో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోతో వృద్ద దంపతులు ప్రసాద్, దేవీల జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రజా ప్రతినిధులు, బాలీవుడ్ ప్రముఖులు బాబా కా దాబా గురించి ప్రమోట్ చేయడంతో దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఆ వృద్ధ దంపతుల దీనగాధను తెలుసుకొన్న పలువురు దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కాలం గిర్రున తిరిగింది. నాడు చిన్న దాబా కాస్త ఇప్పుడు రెస్టారెంట్ అయ్యింది.

మేము చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మాకు సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. మా రెస్టారెంట్​ను ఒకసారి సందర్శించాలని వారిని కోరుతున్నా. ఇక్కడ భారతీయ, చైనా వంటకాలు అందిస్తున్నాం అని కాంతా ప్రసాద్ తెలిపారు. అదే సమయంలో యూట్యూబ‌ర్ గౌరవ్ వాసన్ తనని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు ప్రమోట్ చేస్తూ డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మొత్తానికి చిన్న దాబా నడిపే తాను రెస్టారెంట్ ప్రారంభించడానికి కారణం సోషల్ మీడియానే అని కాంతిప్రసాద్ తెలిపారు.