మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ : రాహుల్ గాంధీ

  • Published By: sreehari ,Published On : November 25, 2019 / 09:25 AM IST
మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ : రాహుల్ గాంధీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల ఎత్తులను బీజేపీ చిత్తు చేసింది. రాత్రికి రాత్రే ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. మరుసటి రోజే రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం (నవంబర్ 25, 2019) లోక్ సభలో మండిపడ్డారు.

మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ఇంకా ప్రశ్నించేందుకు ప్రశ్న ఏముంది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలపరీక్షపై విచారణ సందర్భంగా ఫడ్నవీస్ సర్కార్ కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల లేఖలు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖను కోర్టుకి సమర్పించారు సొలిసిటర్ జనరల్. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమకు 165ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేసింది.

తమకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ నిరూపించుకోగలమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఫడ్నవీస్ సీఎంగా మద్దతు ఇస్తూ 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతోంది. 288 మొత్తం అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ మార్క్ 145 ఉండాలి. బలపరీక్షలో ఎవరైతే ఈ మార్క్ దాటుతారో వారిదే ప్రభుత్వం లాంఛనం అయినట్టే.