మంకీనేనా : ఆ కోతి అరాచకాలకు ఊరు ఖాళీ

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 10:37 AM IST
మంకీనేనా : ఆ కోతి అరాచకాలకు ఊరు ఖాళీ

కోతి చేష్టలు చూడటానికి బాగానే ఉంటుంది. మితిమీరితే తట్టుకోవటం కష్టమే. ఎంత తీవ్రంగా ఉంటుందీ అంటే ఒక గ్రామం గ్రామం ఖాళీ చేసింది. వలసపోయింది. ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా..అక్షర సత్యం. ఓ కోతి చేస్తున్న అరాచకాలకు ఊరిని వదిలి వెళ్లిన ఘటన తమిళనాడులో జరిగింది. నాగపట్నం జిల్లా సిర్గాళి సమీపంలోని తెన్నల్‌కుడి గ్రామం ఉంది. గ్రామంలోని కన్నికోవిల్ వీధిలో 60కిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నెలరోజుల క్రితం తెన్నల్కుడి గ్రామానికి వచ్చింది ఓ కోతి. అప్పటి నుంచి గ్రామస్తులను నిద్ర లేదు. 

ఇళ్లల్లోకి చొరబడి ఆహార పదార్థాలు తీసుకెళ్లిపోతుంది. ఇంట్లోకి వచ్చి ఆగం ఆగం చేస్తోంది. తరమటానికి ప్రయత్నిస్తే ఎదురుతిరుగుతుంది. దాడి చేస్తోంది. చేతుల్లోని వస్తువులను వదలటం లేదు. సంచిలు కూడా లాక్కుని వెళుతుంది. అంతటితో ఆగటం లేదు. కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేయటం మొదలు పెట్టింది. నెలరోజుల్లో 20 మందిని గాయపరిచింది. బైటకు రావాలంటే గ్రామస్తులు హడిలిపోతున్నారు. మనుషులపైనే కాదు.. పశువులపైనా దాడి చేసి గాయపరుస్తుంది. పట్టుకుందాం అంటే దొరకదు. కొడదాం అంటే దొరకదు. సాధారణంగా కుక్కలను చూస్తే కోతులు భయపడతాయి. ఈ కోతి మాత్రం కుక్కలనే భయపెడుతోంది. ఈ కోతి దాడిలో 70 ఏళ్ల వృద్ధురాలు కోమాలోకి వెళ్లింది.

 

ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనే డౌట్ వచ్చింది. గ్రామస్తుల కంప్లయింట్లతో ఫారెస్ట్ అధికారులు వచ్చారు. బోన్లు, వలలు వేశారు. అబ్బే వారం రోజుల అయినా చిక్కలేదు. అప్పటి నుంచి దాడి మరీ పెంచిందంట ఈ కోతి. ఇంజెక్షన్ ఇచ్చి మరీ పట్టుకుందాం అని ప్లాన్ చేశారు అధికారులు. ఓ ఏరియాలో పట్టుకుందాం అంటే.. మరో ప్రాంతంలో దాడి చేస్తోంది. అస్సలు దొరకటం లేదు. చేసేదిలేక గ్రామస్తులు ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. 100 మంది గ్రామ శివారులోని ఓ దేవాలయంలో తలదాచుకుంటున్నారు. కోతిని పట్టుకునేంత వరకు అక్కడే ఉంటామని చెబుతున్నారు. 

ఈ ఘటనపై సిర్గాళి ఫారెస్ట్ రేంజర్‌ స్పందించారు. కొన్నిరోజులుగా కన్నికోవిల్‌ వీధిలో కోతిని పట్టుకోవడానికి మూడు సార్లు బోను ఏర్పాటు చేసినా చిక్కలేదన్నారు. తిరువారూరు అటవీశాఖ కార్యాలయం నుంచి కోతులను పట్టే నిఫుణులను రప్పించామని చెప్పారు. త్వరలో పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు అటవీ శాఖ అధికారులు సతీష్‌, అరివాలి. కోతిని ఎలాగైనా పట్టుకోవాలని గ్రామంలోనే మకాం వేయటం విశేషం..