బాయ్ కాట్ చైనా, రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదు

10TV Telugu News

జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి రాళ్లు, రాడ్లతో దాడి చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత యావత్ భారతం ప్రతీకారంతో రగిలిపోతోంది. చైనాకు బుద్ది చెప్పాల్సిందేనని, దెబ్బకు దెబ్బ తియ్యాల్సిందేనని భారతీయులు నినదిస్తున్నారు. ఇదే సమయంలో బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అనే నినాదం గట్టిగా వినిపిస్తోంది. చైనా వస్తువులను, ఉత్పత్తులను, యాప్స్ ను నిషేధించాలని నినాదాలు చేస్తున్నారు. చైనాకు చెందిన వస్తువులేవీ కొనడకూడదని, వాడకూడదని పిలుపిస్తున్నారు. కొందరు చైనా ఉత్పత్తులైన టీవీలను, ఫోన్లను పగలగొట్టి, తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అసలు బాయ్ కాట్ చైనా సాధ్యమేనా?
దేశం కోసం జవాన్లు చేసిన త్యాగం ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. చైనాను ఆర్థికంగా కుంగదీయాలనే ఆలోచనకు బీజం వేసింది. వెరసి ‘బాయ్ కాట్ చైనా’ మరో సత్యాగ్రహంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ‘స్వదేశీ’ వస్తువులను ఆదరించాలని దేశ ప్రజలను కోరింది. ఈ క్రమంలో అసలు బాయ్ కాట్ చైనా సాధ్యమేనా? చైనా నుంచి ఉత్పత్తుల దిగుమతులను పూర్తిగా ఆపేయడం జరిగే పనేనా? అందులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చైనా మీద ఆధారపడకుండా ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ క్లారిటీ ఇచ్చింది.

చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని:
చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ తయారీ సంస్థల సమాఖ్య తేల్చి చెప్పింది. దేశీయంగా అమ్ముడయ్యే ఉపకరణాలు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో 95 శాతం దేశీయంగానే తయారైనవే ఉంటున్నా.. 25–70 శాతం విడిభాగాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. కరోనా వైరస్‌ పరిణామాలతో చైనా నుంచి సరఫరా దెబ్బతినడంతో అప్పట్నుంచే విడిభాగాల దిగుమతి కోసం దేశీ సంస్థలు ఇతర మార్కెట్లను పరిశీలించడం ప్రారంభించాయని చెప్పింది.

థాయ్‌లాండ్, వియత్నాం, కొరియా నుంచి దిగుమతులు:
చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలన్న ఉద్యమం ఊపందుకోవడానికి ముందు నుంచే కంపెనీలు దీనిపై దృష్టి పెట్టాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది తెలిపారు. థాయ్‌లాండ్, వియత్నాం, కొరియా తదితర దేశాలను పరిశీలించాయని వివరించారు. ఎయిర్‌ కండీషనర్లకు సంబంధించిన విడి భాగాలను అత్యధికంగా, వాషింగ్‌ మెషీన్ల విడిభాగాలను అత్యంత తక్కువగా దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

దేశీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి:
‘పరికరాల కోసం సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దాకా చైనాపై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే తగ్గించుకోవడం సాధ్యం కాదు. ఇందుకు సమయం పడుతుంది. మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి‘ అని కమల్‌ తెలిపారు. దేశీయంగా ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వీటిని అభివృద్ధి చేసుకునేందుకు కనీసం రెండేళ్లయినా పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం కూడా దశలవారీ తయారీ పథకం (పీఎంపీ) వంటి స్కీములతో తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని కమల్‌ చెప్పారు. దీనిపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

చైనాయేతర సంస్థల ఉత్పత్తులకు డిమాండ్‌:
బాయ్‌కాట్‌ చైనా ఉద్యమంతో చైనాయేతర కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ (మొబైల్‌ కమ్యూనికేషన్స్‌) అద్వైత్‌ వైద్య తెలిపారు. ‘గడిచిన కొద్ది రోజులుగా మొబైల్‌ ఫోన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్‌ ఏర్పడింది. రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ధరల శ్రేణిలో కొత్తగా ఆరు హ్యాండ్‌ సెట్స్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. అలాగే భారత్‌లో మా ఉత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుకుంటున్నాం. మా మేకిన్‌ ఇండియా ఉత్పత్తుల గురించి భారీ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం‘ అని ఆయన వివరించారు. ఇక వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్‌ తాము చైనా నుంచి కొనుగోళ్లను నిలిపివేయనున్నట్లు తెలిపింది.

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం:
‘డోక్లాం ఉదంతం జరిగినప్పట్నుంచీ గడిచిన కొన్నాళ్లుగా మేం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం‘ అని సంస్థ ఎండీ చంద్రు కల్రో తెలిపారు. చైనా నుంచి ఫినిష్డ్‌ గూడ్స్‌ కొనుగోళ్లు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, దేశీయంగానే విడిభాగాల వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్‌ అవసరాల కోసం టీటీకే ప్రెస్టీజ్‌ దిగుమతి చేసుకునే వాటిల్లో చైనా వాటా సుమారు 10 శాతం ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతులను 5 శాతానికన్నా తక్కువకే పరిమితం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రు చెప్పారు.

కొన్నేళ్లుగా చైనా నుంచి భారీ మొత్తంలో దిగుమతులు:
నిపుణులు మాత్రం బాయ్ కాట్ చైనా ఆలోచన వాస్తవాలకు దూరంగా ఉందని అంటున్నారు. భారత్ కొన్నేళ్లుగా చైనా నుంచి భారీ మొత్తంలో దిగుమతులు చేసుకుంటోందని చెబుతున్నారు. భారత్ చేసుకుంటున్న దిగుమతుల్లో అత్యధికం చైనా నుంచి వచ్చేవే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇండియా చైనా నుంచి 5.72 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంది. ఇది భారత్ మొత్తం దిగుమతుల్లో 17 శాతంతో సమానం. ఇదే ఏడాది అమెరికా నుంచి ఇండియా 2.34 లక్షల కోట్ల రూపాయల విలువైన దిగుమతులు చేసుకుంది. భారత్ కు అత్యధికంగా ఎగుమతులు చేసే రెండే దేశం అమెరికానే. చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిలో అత్యధికంగా ఎలక్ట్రికల్ మెషినరీ, న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇనుము, స్టీల్ ఉన్నాయి. మొత్తంగా బాయ్ కాట్ చైనా సాధ్యమవ్వాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే అంటున్నారు నిపుణులు.

Read:మీరు బయటి ఫుడ్ తినేందుకు ప్లాన్ చేస్తున్నారా…?