డేరాబాబాకు సీక్రెట్ పెరోల్.. అక్టోబర్‌లో బయటకు వచ్చాడు

  • Published By: vamsi ,Published On : November 7, 2020 / 05:38 PM IST
డేరాబాబాకు సీక్రెట్ పెరోల్.. అక్టోబర్‌లో బయటకు వచ్చాడు

అత్యాచారం, హత్య కేసులో జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అక్టోబర్ 24న ఒకరోజు పెరోల్ తీసుకుని రహస్యంగా బయటకు వచ్చాడు. రామ్ రహీమ్‌కు అక్టోబర్ 24వ తేదీన హర్యానా ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. అత్యాచారం మరియు హత్య కేసులో దోషిగా తేలిన తరువాత రోహ్తక్ సునారియా జైలులో డేరాబాబా ఉంటున్నారు.

ఈ క్రమంలో
అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి రామ్ రహీమ్‌కు ఒక రోజు అవకాశం ఇచ్చారు. భారీ భద్రత మధ్య డేరా చీఫ్‌ను సునారియా జైలు నుంచి గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారు.




అయితే పెరోల్‌ లభించిన విషయం మీడియాకు కూడా తెలియకుండా హరియాణా ప్రభుత్వం జాగ్రత్తపడింది. భారీ బందోబస్తు మధ్య అక్టోబర్ 24వ తేదీన గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడడానికి డేరా బాబాను తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రం వరకూ డేరా బాబా ఆసుపత్రిలో తన తల్లి దగ్గరే ఉన్నారు.



డేరా బాబా రామ్ రహీమ్ రక్షణకు హర్యానా పోలీసులకు చెందిన ముగ్గురు బృందాలను నియమించారు. ఒక యూనిట్‌లో 80 నుంచి 100 మంది పోలీసులు ఉన్నారు. జైలు నుంచి పోలీసు కారులో కర్టెన్లు అంటించి ఆయనను తీసుకుని వచ్చారు. గురుగ్రామ్‌లో పోలీసులు కారును ఆసుపత్రి నేలమాళిగలో నిలిపి ఉంచారు. అతని తల్లి చికిత్స పొందుతున్న అంతస్తు పూర్తిగా ఖాళీ చేయబడింది. తరువాత రామ్ రహీమ్ అనారోగ్యంతో ఉన్న తల్లిని కలిశాడు.



డేరా బాబాకు పెరోల్‌ వచ్చిన విషయాన్ని రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించారు. రామ్ రహీమ్ గుర్గావ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్ల కోసం జైలు సూపరింటెండెంట్ నుంచి తనకు వినతి వచ్చిందని వెల్లడించారు. డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆ జర్నలిస్టును డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపగా.. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలి 20 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్నారు.