శివసేనకు షాక్ : మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : November 8, 2019 / 11:38 AM IST
శివసేనకు షాక్ : మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాడే వరకు తాత్కాలిక సీఎంగా ఉండాలని గవర్నర్ కోరారని,దానికి తాను అంగీకరించానని  ఫడ్నవీస్ తెలిపారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. 

సీఎం సీటుని చెరో రెండున్న సంవత్సరాలు పంచుకునేందుకు ఎన్నికల ముందు బీజేపీ ఒప్పుకుందంటూ శివసేన ప్రకటనలు చేస్తుందని,అయితే 50:50 ఫార్ములా గురించి తనకు తెలియదన్నారు. శివసేనతో అలాంటి ఒప్పందం జరగలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి శివసేన చేస్తున్న ప్రకటనలు చూసి తాను హర్ట్ అయ్యానని ఫడ్నవీస్ అన్నారు. అన్ని ఆఫ్షన్లు ఓపెన్ అంటూ ఉద్దవ్ ఠాక్రే ప్రకటనలు చేస్తున్నారని,దానికి తాను హర్ట్ అయ్యానన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన ఇప్పటివరకు తనను కలవలేదని,కానీ కాంగ్రెస్,ఎన్సీపీలను కలిసినట్లు తెలిపారు. తాను ఉద్దవ్ ఠాక్రేకు ఫోన్ చేశానని,అయితే ఉద్దవ్ తనతో మాట్లాడలేదని ఫడ్నవీస్ తెలిపారు.

భాగస్వామిగా ఉంటూ శివసేన…బీజేపీపై విమర్శలు చేస్తుందని,మోడీపై శివసేన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. ప్రజల తీర్పుని శివసేన గౌరవించడం లేదన్నారు. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, బీజేపీ వ్యక్తే మహారాష్ట్రలో సీఎం సీటులో ఉంటారన్నారు. అమిత్ షా,గడ్కరీల నిర్ణయం కూడా ఇదేనని,సీఎం సీటు పంచుకోవాలని ఎప్పుడూ శివసేనతో చర్చించలేదని అమిత్ షా,గడ్కరీ చెప్పారని ఫడ్నవీస్ తెలిపారు. ఇతర పార్టీల నాయకులను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ వస్తున్న ఆరోపణలను తాను ఖండిస్తున్నానని ఫడ్నవీస్ అన్నారు.

గత నెల 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం ఇవాళ(నవంబర్-8,2019)తో ముగుస్తుంది. మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు.