కనిపించడం లేదు : నిత్యానంద దేశం విడిచి పారిపోయాడా

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడా..గుజరాత్‌ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 01:21 PM IST
కనిపించడం లేదు : నిత్యానంద దేశం విడిచి పారిపోయాడా

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడా..గుజరాత్‌ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది.

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడా..గుజరాత్‌ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది. స్వామి నిత్యానంద ఉరఫ్ నిత్యానందకి గుజరాత్‌లోనూ ఓ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఈ కంప్లైంట్‌ గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో తాము చూసిన పరిస్థితిని బట్టి..ఇక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిత్యానందపైనా కేసు రిజిస్టర్ చేశారు.

అయితే బెంగళూరు సిటీకి దగ్గర్లోని బిడిది ఆశ్రమంలోనూ అయ్యగారి జాడలు కన్పించలేదు. దీంతో నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడనే అనుమానం కలుగుతోంది. దీనికి తోడు ఇతగాడిపై ఇప్పటికే తొమ్మిదేళ్లనాటి కేసు కూడా ఒకటి వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. అప్పట్నుంచే నిత్యానంద బైట కన్పించడం దాదాపు లేకుండా పోయింది..ఐతే ఈ మధ్యకాలంలో తిరిగి తన కార్యకలాపాలు మొదలెట్టాడని అంటున్నారు. 

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు.. యోగిణి సర్వజ్ఞపీఠం ఆశ్రమం నిర్వహణ భాద్యతలను సాద్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధి కిరణ్ అనే ఇద్దరు మహిళలు చూసుకుంటున్నారు.  తాజా ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిద్దరినే అరెస్ట్ చేశారు.. నిత్యానంద కోసం గాలింపు మొదలెట్టారు. 

అసలు గుజరాత్‌లోనూ నిత్యానంద లీలలు ఎలా బయటపడ్డాయంటే స్థానికుడైన జనార్ధనశర్మ దంపతులు ఇద్దరు కుమార్తెలు నిత్యానంద ఆశ్రమానికి వెళ్తూ వస్తుండే వారు..ఐతే కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ ఇంటికి రావడానికి నిరాకరించారు. దీంతో పోలీసుల సాయంలో శర్మ సర్వజ్ఞపీఠానికి వెళ్లగా..ఆయన ఇద్దరు కూతుళ్లు ఇంటికి వచ్చేది లేదని చెప్పారు. దీంతో జనార్ధనశర్మ తన కూతుళ్లని అక్రమంగా ఆశ్రమంలో ఉంచారంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఇక ఇప్పుడు ఈ కేసు గుజరాత్ టూ బిడిది వయా అహ్మదాబాద్‌గా మారబోతోంది. ఇప్పటికే గుజరాత్ పోలీసులు బెంగళూరు పోలీసులతో టచ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. ఆశ్రమానికి తొందర్లోనే వెళ్లి అక్కడా తీగె లాగుతారని అంటున్నారు. అయితే బిడిది ఆశ్రమంలో నిత్యానంద జాడలు కన్పించడం లేదు. దీంతో అసలు దేశంలో ఉన్నాడా..విదేశాలకు పారిపోయాడా అనే అనుమానం వ్యక్తమవుతోంది.