Digvijay on RSS: మోహన్ భాగవత్ ప్రసంగంపై దిగ్విజయ్ సెటైర్లు.. ఆర్ఎస్ఎస్పై ప్రశ్నల వర్షం
ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్‌కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటారా? సర్ సంఘ్‌చాలక్‌గా ఓ మహిళను నియమించగలరా? తదుపరి సర్ సంఘ్‌చాలక్‌గా కొంకాస్ట్/చిట్‌పవన్/బ్రాహ్మణ కానివారు కాగలరా? ఓబీసీ/ఎస్‌సీ/ఎస్‌టీ సర్ సంఘ్‌చాలక్ ఆరెస్సెస్‌లోని అన్ని స్థాయులవారికి అంగీకారమేనా?

Digvijay Singh asked several questions to Mohan Bhagwat and RSS
Digvijay on RSS: దసరా సందర్భంగా బుధవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ మాట్లాడుతూ సమాజ ప్రగతిలో మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల్లో ఆర్ఎస్ఎస్కు తొందరలో మహిళా అధినేత రాబోతున్నారనే విషయం స్పష్టమవుతోందని నిన్నటి నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా, భాగవత్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సెటైర్లు విసిరారు. అలాగే సంస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్ఎసెఎస్ అధినేతగా మహిళను, దళిత వ్యక్తిని, ముస్లిం వ్యక్తిని చేస్తారా అంటూ దిగ్విజయ్ ప్రశ్నించారు.
‘‘ఆరెస్సెస్ మారుతోందా? చిరుత పులి తన శరీరంపైన ఉండే మచ్చలను మార్చుకోగలుగుతుందా? ఆరెస్సెస్ స్వభావంలో మౌలిక మార్పులు చేయాలని వారు కోరుకుంటే, మోహన్ భాగవత్‌కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎజెండాను వదులుకుంటారా? సర్ సంఘ్‌చాలక్‌గా ఓ మహిళను నియమించగలరా? తదుపరి సర్ సంఘ్‌చాలక్‌గా కొంకాస్ట్, చిట్‌పవన్, బ్రాహ్మణ కానివారు కాగలరా? ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ సర్ సంఘ్‌చాలక్ ఆరెస్సెస్‌లోని అన్ని స్థాయులవారికి అంగీకారమేనా? ఆరెస్సెస్‌ను రిజిస్టర్ చేస్తారా? ఆరెస్సెస్ రెగ్యులర్ మెంబర్‌షిప్ ఉంటుందా? మైనారిటీలకు ఆరెఎస్ఎస్ సభ్యత్వం ఇస్తారా? నా ప్రశ్నలకు సకారాత్మకంగా సమాధానాలు చెబితే నాకు ఆరెఎస్ఎస్తో ఎటువంటి సమస్యా ఉండదు’’ అని దిగ్విజయ్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మోహన్ భాగవత్ గారూ, మీరు వీటన్నిటినీ చేస్తే, నేను మీ మద్దతుదారును అయిపోతాను’’ అన్నారు.