దిశ చట్టం కోసం కమిటీ : జగన్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట

  • Published By: madhu ,Published On : February 26, 2020 / 10:05 AM IST
దిశ చట్టం కోసం కమిటీ : జగన్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట

ఏపీలో నూతనంగా తీసుకొచ్చిన దిశ చట్టంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి సీఎం జగన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అత్యాచారాల వంటి అఘాయిత్యాలకు పాల్పడితే..21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు ఉరి శిక్ష పడేలా ఈ చట్టం రూపొందింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై సీరియస్‌గా ఆలోచిస్తోంది ఉద్దవ్ ఠాక్రే. అందులో భాగంగా..ఓ ముందడుగు వేసింది. 

ముసాయిదా చట్టాన్ని రూపొందించడానికి ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి అశ్వతి నేతృత్వంలో 10 రోజుల్లోపు ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దిశ చట్టాన్ని అధ్యయనం చేయడానికి హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ఇటీవలే ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ముసాయిదాను పది రోజుల్లోగా సమర్పించాలని కమిటీనిని కోరినట్లు మంత్రి సతేజ్ పాటిల్ వెల్లడించారు.

తదనంతరం న్యాయశాఖ దీనిపై పరిశీలన చేస్తుందన్నారు. దీని తర్వాత ఎలాంటి మార్గాల్లో చట్టం అమలు చేసే అవకాశం ఉంది తదితర అంశాలపై అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు. ఐదుగురు సభ్యుల కమిటీలో నియాతి ఠక్కర్ డేవ్ డీసీపీ (జోన్ V), వి. భట్ డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ)తో పాటు తదితరులున్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలపై జరుగుతున్న నేరాలపై కఠినంగా ఉండాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని అనుసరించాలని దేశ్ ముఖ్ వెల్లడించారు. 

Read More>> జీతం సరిపోలేదేమో : సైన్ కోసం లక్షలు డిమాండ్ చేసిన మహిళాధికారి

ఏపీ ప్రభుత్వం అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా దిశ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపించాయి.