మాట వినక పోయే సరికి ఇళ్ళల్లో పెట్టి తాళం వేశారు

  • Published By: chvmurthy ,Published On : April 10, 2020 / 12:14 PM IST
మాట వినక పోయే సరికి ఇళ్ళల్లో పెట్టి తాళం వేశారు

లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు.  దీంతో పోలీసులు వారిని ఇళ్లల్లో పెట్టి తాళాలు వేశారు. మధ్యప్రదేశ్ లోని రెండు పట్టణాల్లో పోలీసులు కరోనా వైరస్ కట్టడికి  ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది.  

ఛాతర్‌పూర్ జిల్లాలోని ఖజురహో, రాజ్‌నగర్ పట్టణాల్లో ఎంతచెప్పినా వినకుండా లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న 47 మందిని పోలీసులు వారి, వారి  ఇళ్లల్లో పెట్టి బయటి నుంచి తాళం వేసేశారు. గురువారం సాయంత్రం అధికారులు ఈ కఠిన చర్యను అమలుచేశారు.. 

ఒక కరోనా పాజిటివ్ టూరిస్టు వచ్చి వెళ్లాడని తెలియడంతో ఈ ప్రాంతాల్లో మార్చి 25 నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇంటికే పరిమితం కావాలన్న ఆదేశాల్ని కొన్ని కుటుంబాలు నిర్లక్ష్యం చేస్తూ బయట తిరుగుతున్నాయని సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు స్వామ్నిల్ వాంఖెడే చెప్పారు. 

మార్చి 30 తర్వాత బయటకు వెళ్లి గ్వాలియర్, భోపాల్, కాన్పూర్, అలాహాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చిన వారిపై మాత్రమే ఈ చర్య తీసుకున్నామని ఆయన వివరించారు. నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలకు సంబంధించిన ఫోన్ నంబర్లు వారికి ఇచ్చామని తెలిపారు. ఐసోలేషన్ విషయంలో అధికారులకు సహకరించనివారందరిపై ఈ తరహా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.