దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో తీవ్రమైన కరోనా ప్రమాద సంకేతాలు

  • Published By: vamsi ,Published On : July 17, 2020 / 02:15 PM IST
దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో తీవ్రమైన కరోనా ప్రమాద సంకేతాలు

భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు మిలియన్ మార్కును చేరుకుంది. ప్రపంచంలో ఈ సంఖ్యను దాటిన మూడవ దేశం భారత్ మాత్రమే. దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. ప్రతిరోజూ 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నందున, ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ప్రతిరోజూ వేలాది కేసులు వస్తున్నాయి. దేశంలో రాబోయే కాలంలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటం మరింత కష్టతరం అవుతుంది అని ఈ లెక్కలు చెబుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలోనే మొత్తం కేసులలో 30 శాతం నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు రోజుకు 8వేల కేసులు వస్తున్నాయి. మరోవైపు తమిళనాడు, కర్ణాటకలలో ప్రతిరోజూ నాలుగు వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

ప్రతిరోజూ గరిష్ట కేసులు వస్తున్న రాష్ట్రాలను పరిశీలిస్తే..

రాష్ట్రం గత 24 గంటల్లో కేసులు మొత్తం కేసులు
మహారాష్ట్ర 8641 2.84 లక్షలు
తమిళనాడు 4549 1.56 లక్షలు
ఢిల్లీ 1652 1.18 లక్షలు
కర్ణాటక 4169 51 వేలు
ఉత్తర ప్రదేశ్ 2058 43 వేలు
ఆంధ్రప్రదేశ్ 2593 38 వేలు
బీహార్ 1385 21 వేలు
పశ్చిమ బెంగాల్ 1690 36 వేలు
తెలంగాణ 1676 41 వేలు

దేశంలో పది రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ ఎక్కువ భాగం కేసులు ఉండగా.. పరీక్ష గణాంకాలను పరిశీలిస్తే, ఇప్పుడు ప్రతి మూడు రోజులకు ఒక మిలియన్ పరీక్షలు జరుగుతున్నాయి మరియు లక్ష కేసులు బయటకు వస్తున్నాయి. అంటే, దేశంలో పాజిటివిటీ రేటు పది శాతం ఉంది.

లేటెస్ట్‌గా ఓ అధ్యయనం మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో ప్రమాదకర రాష్ట్రాల జాబితాను ప్రముఖ మెడికల్ జర్నల్ లాంసెట్ ప్రకటించింది. బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్ – తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లోని అనేక జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పింది.

ది లాన్సెట్ జర్నల్‌ లోని అధ్యయనం ప్రకారం, కోవిడ్-19 మహమ్మారికి ఎక్కువగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, బీహార్, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల జిల్లాలోని హౌసింగ్, పరిశుభ్రత , ఆరోగ‍్య వ్యవస్థ లాంటి అనేక ముఖ్య సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్టు అధ్యయనం తెలిపింది.