పుట్టగొడుగులతో కోట్ల సంపాదన… నిరుద్యోగులకు స్పూర్తిగా దివ్య రావత్

  • Published By: Chandu 10tv ,Published On : September 21, 2020 / 03:24 PM IST
పుట్టగొడుగులతో కోట్ల సంపాదన… నిరుద్యోగులకు స్పూర్తిగా దివ్య రావత్

దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తు కళ్లు కాయలు కాచ్చేలాగా ఎదురుచూసి రావటంలేదని బాధపడేదానికన్నా మనకు నచ్చిన ఏదో ఒక పనిలో ఆనందం వెతుకోవచ్చునని, వేలకు వేలు సంపాదించవచ్చునని నిరూపించింది ఉత్తరాఖండ్ కు చెందిన యువతి దివ్య రావత్. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం కంటే ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒకటి చేయాలనుకుని పుట్టగొడుగుల వ్యాపారాన్ని మెుదలు పెట్టింది. సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని మార్కెట్ కు కొత్త వంగడాలను పరిచయం చేస్తున్నది దివ్య.


ఉత్తరాఖండ్‌కు చెందిన 22 ఏండ్ల దివ్య రావత్.. ఉన్నతా చదువుల కోసం ఢిల్లీకి వెళ్లింది. అమిటీ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివింది. ఆతర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో రూ.25 వేల జీతానికి ఉద్యోగం చేశారు. ఒకదాని తరువాత ఒకటి అలా ఎనిమిది ఉద్యోగాలు మారినా ఎక్కడ కూడా ఆమెకి సంతృప్తి నివ్వలేదు. దానికి భిన్నంగా ఏదైనా చేయాలనే కోరిక ఆమెను తిరిగి తన గ్రామానికి వచ్చేలా చేసింది. 2013 లో దివ్య తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం గమనించింది. అలా వలస వెళ్లకుండా మరికొందరిని వలస నుంచి తప్పించేందుకు పుట్టగొడుగుల పెంపకం చేపట్టింది. పుట్టగొడుగులపై విశేష పరిశోధనలు ఒకవైపు చేస్తూనే.. మరోవైపు గ్రామాల్లోని మహిళలను ఒకే తాటి పైకి తీసుకురావడానికి చాలా కష్టపడింది. 2015 లో పుట్టగొడుగుల సాగులో శిక్షణ తీసుకుని రూ.3 లక్షల పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టింది. గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని మహిళలను తన సాగులో భాగస్వాములుగా చేసి, మరిన్ని పుట్టగొడుగులు పెంచుతున్నది. అలా ఉత్తరాఖండ్‌లోని 10 జిల్లాల్లో 55 యూనిట్లను ఏర్పాటుచేసి వందలాది మందికి ఉపాధి కల్పించింది.

రాష్ట్రంలో అందరూ ఆమెను ‘మష్రూమ్ గర్ల్’ అని పిలుస్తారు. ‘మష్రూమ్ గర్ల్’ పేరుతో పిలువబడే దివ్యను ఉత్తరాఖండ్ ప్రభుత్వం పుట్టగొడుగుల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దివ్య పుట్టగొడుగుల పెంపకం ద్వారా ప్రతి ఏటా రూ.2 కోట్లకు పైగా సంపాదిస్తుంది. ‘పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్నాను ఎందుకంటే మార్కెట్ సర్వే ప్రకారం కూరగాయల కన్నా పుట్టగొడుగుల ధరలు మంచివని తేలింది. ఒక కిలో బంగాళాదుంప ఎనిమిది నుంచి పది రూపాయలు ఉండగా.. పుట్టగొడుగు కనీస ధర కిలోకు రూ.100. ఉందని పుట్టగొడుగులను పండించాలని నిర్ణయించుకున్నాను అని దివ్య రావత్ తెలిపింది.


ప్రస్తుతం దివ్య కోట్లాది రూపాయాల వార్షిక ఆదాయం ఉన్న సౌమ్య పుడ్ ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నది. పుట్టగొడుగుల సాగు ద్వారా అక్కడ ఉన్న స్ధానిక మహిళలకు ఎంతో కొంత సంపాదించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. శీతాకాలంలో బటన్, మధ్య సీజన్లో ఓస్టెర్, వేసవి కాలంలో మిల్కీ పుట్టగొడుగులను పండిస్తుంటారు. వీటితో పాటు హిమాలయ ప్రాంతంలో కనిపించే కార్డిసెఫ్ మిలిటరీస్ అనే జాతి పురుగును మార్కెట్లో కిలోకు రూ.2 నుంచి 3 లక్షలకు అమ్ముతుంటారు. దివ్య వాణిజ్య సాగు కోసం ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసింది. సామాన్యుల ఆహారంలోకి పుట్టగొడుగులను చేర్చాలనే దివ్య ఆశయాలు ఫలించాలని కోరుకుందాం.