మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2020 / 09:32 AM IST
మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. లాక్‌ డౌన్‌ సరిగ్గా అమలు కావడం లేదని.. కోవిడ్‌-19(కరోనా వైరస్‌)సంక్షోభాన్ని ఎదుర్కోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మస్తుతి అసహ్యంగా ఉందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రధానమంత్ని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నియోజకవర్గంలో ఆరుగురు చిన్న పిల్లలు గడ్డి తింటున్నట్లుగా ఉన్న ఫొటోను పీకే తన ట్విటర్ లో షేర్ చేశారు. కాగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాన నరేంద్ర మోదీ ప్రకటించిన 36 గంటల్లో.. రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీహారీల విషయంలో బిహార్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. రోజూవారీ కూలీలు, పేదల కోసం బిహార్‌ ప్రభుత్వం నిధిని కేటాయించాలంటూ గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మరో ట్వీట్‌ లో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

బుధవారం వారణాశి జిల్లాలోని కొయిరీపూర్ గ్రామంలోని ముషార్ బస్తీలో ఉన్న ఐదేళ్ల వయస్సు,అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న ఐదుగురు చిన్నారులు నేలపై కూర్చొని స్థానిక బాషలో అక్రిగా పిలువడబబే గడ్డిని తిన్నారు. ముషార్ బస్తీలో నివసించే పది కుటుంబాలలో, పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పన్నెండు మంది పిల్లలు ఉన్నారు. చాలా కుటుంబాలలో సంపాదించే వాళ్లు… రోజువారీ కూలీపనులకు వెళ్లేవాళ్లు మరియు సమీపంలోని నిర్మాణ కర్మాగారాలు మరియు ఇటుక బట్టీలలో పని చేస్తారు.

లాక్ డౌన్ కారణంగా పని లేకుండా వాళ్లు ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది ఈ ఫొటోనే. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫొటో వైరల్ అవడంతో వారణాశి జిల్లా యంత్రాంగం స్పందించింది. బడగావ్ పోలీసు చౌకి స్టేషన్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ బుధవారం గ్రామాన్ని సందర్శించి కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

స్థానికుల ప్రకారం, వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ బుధవారం సంజయ్ కుమార్ సింగ్ తో పాటు గ్రామ ప్రధాన్ శివరాజ్ యాదవ్ సహాయంతో 15 కిలోల రేషన్‌ను గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. గ్రామంలోని ఒక వ్యక్తి మాట్లాడుతూ…రాబోయే 21 రోజులకు మాకు 15 కిలోల కిరాణా లభించింది, మరుసటి నెలలో మాకు అవసరమైతే మళ్ళీ మాకు సహాయం చేస్తారని వారు చెప్పారు అని తెలిపారు.