వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ఖతమైపోతుందా ? స్వేచ్చగా తిరిగేయవచ్చా ? తెలుసుకోవాల్సిన విషయాలు

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా ఖతమైపోతుందా ? స్వేచ్చగా తిరిగేయవచ్చా ? తెలుసుకోవాల్సిన విషయాలు

vaccinated : కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకీ వ్యాక్సిన్‌ తీసుకున్నంత మాత్రాన కరోనా ఖతమైపోతుందా…? వ్యాక్సిన్‌ తీసుకున్న వారు స్వేచ్ఛగా తిరిగేయవచ్చా…? కరోనాకు అసలు భయపడాల్సిన పనిలేదా…? మాస్కులు, భౌతిక దూరానికి వీడ్కోలు పలకొచ్చా..?

రోగ నిరోధక శక్తి : –
కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది.. ఇక కరోనా వైరస్‌ తమ దరిచేరదు.. వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే వైరస్‌ నుంచి రక్షణ కలుగుతుందనే భావన కొందరిలో ఉంది. అయితే, కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14 రోజుల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కూడా కేవలం 50 శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుంది. రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందంటున్నారు నిపుణులు. అది కూడా రెండో డోసు తీసుకున్న 14రోజుల తర్వాతే ఈ వైరస్‌ను ఎదుర్కోనే శక్తి వస్తుందంటున్నారు నిపుణులు.

జ్వరం వంటి లక్షణాలు: –
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో వ్యాక్సిన్‌లు దోహదం చేస్తాయి. శరీరంలో వైరస్‌ ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి మెమొరీ కణాలుగా పిలిచే టీ-లింఫోసైట్స్‌, బీ-లింఫోసైట్లను సరఫరా చేయడమే వ్యాక్సిన్ల కర్తవ్యం. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ కణాలను ఉత్పత్తి చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సిన్‌ నుంచి రక్షణ పొందేందుకు సాధారణంగా 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అందుకే వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ ఒక్కోసారి వైరస్‌ లక్షణాలు బయటపడుతాయి. ఇక మరికొన్ని సార్లు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగనిరోధకత పెరుగుతున్న సమయంలోనూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం రోగనిరోధకతను వృద్ధి చేసుకుంటోందనడానికి గుర్తుగా ఆ లక్షణాలను భావించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే : –
శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌కు కారణమయ్యే వైరస్‌ను గుర్తించి రోగ నిరోధక శక్తిని సంసిద్ధం చేయడంలో తొలి డోసు ఉపయోగపడుతుంది. ఇక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా ఆ రోగనిరోధక శక్తిని మరికొన్ని నెలల పాటు కొనసాగించడం రెండో డోసు తర్వాతే లభిస్తుంది. అంటే రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇటీవల అమెరికాలో వ్యాక్సిన్‌ తీసుకున్న నర్సుకు కూడా వైరస్‌ సోకింది. దీంతో వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్న రెండ్రోజుల్లోనే ఆమెకు వైరస్‌ సోకినట్లు తేలింది. దీన్నిబట్టి వ్యాక్సిన్‌ రెండోడోసు తీసుకున్నాక 14 రోజుల తర్వాతే మనకు వైరస్‌ నుంచి రక్షణ దొరుకుతుంది. కాబట్టి అప్పటిదాకా అంతా జాగ్రత్తగా ఉండాల్సిందే. మాస్క్‌ ధరించాల్సిందే, భౌతిక దూరం పాటించాల్సిందే… లేకపోతే వ్యాక్సిన్‌ తీసుకున్నా ఉపయోగం ఉండదు.