వివాహేతర సంబంధం.. అనవసర పబ్లిసిటీ వద్దు, మీడియాకు కోర్టు సూచన

పుణెలో 23ఏళ్ల మహిళ ఆత్మహత్య కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివాహేతర సంబంధం.. అనవసర పబ్లిసిటీ వద్దు, మీడియాకు కోర్టు సూచన

Unnecessary Publicity Pune Womans Death: పుణెలో 23ఏళ్ల మహిళ ఆత్మహత్య కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియా తీరుపై మండిపడింది. ఓవరాక్షన్ వద్దని సూచించింది. పుణెలో 23 ఏళ్ల మహిళ ఆత్మహత్య, ఆమెకు అక్రమ సంబంధం ఉందనే అనుమానాలకు సంబంధించి అనవసరమైన పబ్లిసిటీ చేయవద్దని మీడియాకు బాంబే హైకోర్టు సూచించింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీశ్ పితాలేలతో కూడిన డివిజన్ బెంచ్ మృతురాలి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించింది. తన కూతురుపై మీడియాలో వస్తున్న కథనాలపై పిటిషన్ లో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

తన పిటిషనర్ కూతురు పుణెలోని తన ఇంటి బాల్కనీ నుంచి పడిపోయిందని… ఫిబ్రవరి 8న ఆమె చనిపోయినట్టు ఆసుపత్రిలోని వైద్యులు ప్రకటించారని పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ శిరీశ్ గుప్టే కోర్టుకి తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఆమెకు ఒక వ్యక్తితో శారీరక సంబంధం ఉందంటూ కథనాలు రాశాయని ఆయన వివరించారు. అంతేకాదు, చనిపోయిన మహిళ గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడిన 12 ఆడియో క్లిప్పులను కొన్ని రాజకీయపార్టీలు, మీడియా సంస్థలు..సోషల్ మీడియాలో సర్కులేట్ చేసినట్టు కోర్టుకి తెలిపారు.

సున్నితమైన కేసుల్లో మీడియా నియంత్రణ పాటించాలని సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో హైకోర్టు సూచించిందని… ఈ కేసు విషయంలో కూడా అదే విధమైన సూచనలు చేయాలని సీనియర్ లాయర్ గుప్టే హైకోర్టును కోరారు. దీనిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. మహిళ ఆత్మహత్య కేసులో అనవసరమైన పబ్లిసిటీ చేయవద్దని మీడియాకు హైకోర్టు సూచించింది. ఓవరాక్షన్ తగ్గించుకోవాలని హితవు పలికింది.