సైనికుల ఫొటోలు వాడొద్దు: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్

ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని,

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 01:55 AM IST
సైనికుల ఫొటోలు వాడొద్దు: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్

ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని,

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. సైనికుల త్యాగాలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని, ప్రదర్శించొద్దని ఈసీ ఆదేశించింది. సైనిక సిబ్బంది ఫొటోలను ప్రకటనల్లో వాడకుండా అభ్యర్థులు, నాయకులను రాజకీయ పార్టీలు నియంత్రించాలని స్పష్టం చేసింది.

పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చడంతో పాటు శత్రువుల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. దేశవ్యాప్తంగా అభినందన్‌తో ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటుచేసి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభినందన్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నించాయి.

ఇదే అదనుగా ఓ బీజేపీ సీనియర్‌ నేత అభినందన్‌ ఫొటోతో హోర్డింగ్ చేయించారు. ఈ హోర్డింగ్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారం ఈసీ దృష్టికి వెళ్లింది. సైనికుడి ఫొటో వాడుకుని బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రచార చిత్రాలు, హోర్డింగ్‌లలో సైనిక సిబ్బంది ఫొటోలు లేకుండా చూడాలని 2013లోనూ ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. సైనికుల ఫొటోలను రాజకీయ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు వాడుకుంటున్నారని, దీన్ని నియంత్రించేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని అప్పట్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈసీని కోరింది. ఆ రూల్ ను ఈసీ మరోసారి గుర్తు చేసింది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.