వితంతువుగా ఉండలేను.. విడాకులు ఇప్పించండి: నిర్భయ దోషి భార్య

  • Published By: vamsi ,Published On : March 17, 2020 / 07:18 PM IST
వితంతువుగా ఉండలేను.. విడాకులు ఇప్పించండి: నిర్భయ దోషి భార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు మూసుకుపోగా.. వ్యూహ, ప్రతివ్యూహాలతో నిర్భయ దోషులు ఉరిని ఆలస్యం చేసుకునేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా ఈ నెల 20వ తేదీన నిర్భయ దోషుల ఉరికి ఢిల్లీ కోర్టు వారెంట్లు జారీ చేయగా.. ఈ క్రమంలోనే నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనం అయ్యింది.

దోషులకు డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. తన భర్త నిర్దోషి అని, కానీ అతడిని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించారని, అత్యాచారం కేసులో ఉరి వెయ్యబోతున్న వ్యక్తికి భార్యగా ఉండదలుచుకోలేదంటూ ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది ఆమె. వితంతువుగా ఉండలేను అని, ముందుగానే విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయనిపుణులు ఈ విడాకుల పిటిషన్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పునీత భర్త అక్షయ్ కుమార్ సింగ్‌కు కోర్టు నోటీసులు పంపాల్సి ఉంటుంది.

ఈ విడాకుల కేసులో తీర్పు వచ్చేవరకు వారికి ఉరి వాయిదా పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు న్యాయ నిపుణులు. అక్షయ్ కుమార్ సింగ్‌ భార్య వేసిన పిటిషన్‌ మార్చి 19వ తేదీన విచారణకు రానుంది. ఈ విషయం గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు’’ అని ఆయన వెల్లడించారు.

అయితే కొందరు న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. అత్యాచారం జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత.. ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిందంటే.. ఉరిని వాయిదా వేయించేందుకు ఇది మరొక అస్త్రం అని అంటున్నారు.