5G ట్రయల్స్ కు టెలికాంశాఖ అనుమతి

దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన భారత్

5G ట్రయల్స్ కు టెలికాంశాఖ అనుమతి

Dot Approves Telcos Applications For 5g Trials No Chinese Tech For Trials

5G trials దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఇప్పటివరకు 4జీతో పరుగులు పెట్టిన భారత్.. త్వరలో 5జీతో పరుగులు పెట్టనుంది. దేశంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా 5 జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

దేశంలో 5జీ ట్రయల్స్‌కు టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది. అయితే, చైనా కంపెనీలైన హువావే, జెడ్‌టీఈలను 5 జీ ట్రయల్‌కు దూరంగా ఉంచారు. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని వాడకూడదని స్పష్టం చేసింది. ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో పాటు రిలయన్స్‌ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు అనుమతి లభించడం విశేషం.

చైనాకు చెందిన హువాయ్‌ టెక్నాలజీని ఉపయోగించి ట్రయల్‌ చేస్తామని భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ప్రతిపాదించాయి. ఆ తర్వాత చైనా కంపెనీల టెక్నాలజీ సాయం లేకుండానే ట్రయల్స్‌ నిర్వహిస్తామని ప్రకటించాయి. ఈ టెలికాం కంపెనీలు అన్నీ ఎరిక్‌సన్‌, నోకియా, శాంసంగ్‌, సి-డాట్‌ అభివృద్ధి చేసి టెక్నాలజీ సాయం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఒక్క రిలయన్స్‌ జియో మాత్రమే సొంతంగా అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీని వాడుతోంది. ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్‌ నిర్వహించాలి. సామగ్రి సిద్ధం చేసుకోవడానికి రెండు నెలల సమయం పడుతుంది.

5 జీ ట్రయల్ కోసం టెలికాం కంపెనీలకు త్వరలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఎయిర్ వేవ్స్ ఇవ్వనున్నట్లు టెలికం విభాగం ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు వంటి షరతులను కంపెనీలు పాటించాల్సి ఉంటుందని ఆయ‌న చెప్పారు. నెట్‌వర్క్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. టెలికాం కంపెనీలకు ఎయిర్‌వేవ్స్‌ను ట్రయల్స్‌కు మాత్రమే ఉపయోగించాలి. వాణిజ్య‌ప‌రంగా ఉప‌యోగించ‌కూడదు. కంపెనీలు ఈ షరతులను ఉల్లంఘిస్తే వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని టెలికం విభాగం హెచ్చ‌రించింది.