‘ఇస్రో’ ప్రైవేటీకరణపై శివన్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 20, 2020 / 07:46 PM IST
‘ఇస్రో’ ప్రైవేటీకరణపై శివన్ కీలక వ్యాఖ్యలు

అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతించిన నేపథ్యంలో భారత అంతరిక్ష పరశోధన సంస్థ(ఇస్రో)ప్రైవేటీకరణపై ఉహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ.. ఇస్రోను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఇస్రో ఛైర్మన్​ శివన్ క్లారిటీ ఇచ్చారు.

ఇస్రో ఏర్పాటు చేసిన ఓ వెబినార్​లో శివన్​ మాట్లాడుతూ…. అంతరిక్ష పరిశోధనల్లో గమ్యాలను చేరుకోవడంపైనే ఇస్రో దృష్టిపెట్టింది. అభివృద్ధి కార్యకలాపాలు తోడైతే.. తన వనరులను ఉపయోగించుకుని ఇస్రో మరింత సమర్థంగా పనిచేయగలుగుతుంది. అందుకే అందరికీ మళ్లీ చెబుతున్నా. అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టినంత మాత్రాన.. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నట్టు కాదు. ఇది ఓ అపోహ మాత్రమే. ఇంతకు ముందు ఇస్రో ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుందని శివన్ అన్నారు.

భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌, ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది జూన్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాకెట్లు- ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సర్వీసుల్లో ఇకపై ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని శివన్ ఇప్పటికే​ వెల్లడించారు. ఇంటర్​ ప్లానెటరీ మిషన్స్​లో కూడా ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని తెలిపారు. అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో.. ఇస్రో ప్రైవేటీకరణకు సంబంధం లేదని శివన్​ స్పష్టం చేశారు.