మందుబాబుల కష్టాలు.. మద్యం ఎలా తయారుచేయాలో ఇంటర్నెట్లో సెర్చింగ్!

మందుబాబుల కష్టాలు.. మద్యం ఎలా తయారుచేయాలో ఇంటర్నెట్లో సెర్చింగ్!

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. నిత్యావసరాలు మినహా మద్యం షాపులతో పాటు దాదాపు అన్ని మూతపడ్డాయి. మద్యం
షాపులు మూసివేయడంతో మందు బాబులు అల్లాడిపోతున్నారు. మద్యం కోసం ఆరాటపడుతున్నారు. మద్యానికి బానిసైన వారంతా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
మరికొందరు మద్యం కోసం ప్రయత్నించి విసిగిపోతున్నారు.

మద్యం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొందరు మద్యం కోసం అక్రమంగా వైన్ షాపుల్లో దొంగతనానికి పాల్పడే వారు లేకపోలేదు. మద్యం అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మద్యాన్ని అధిక ధరలకు విక్రయించేవారు ఉన్నారు. సాధారణంగా రూ.700 విలువ గల లిక్కర్ బాటిళ్లను రూ.3 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. మద్యం అసలు దొరకని వారంతా మద్యం ఎలా తయారుచేయాలో తెలుసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. కొంతమంది ఇంటర్నెట్‌లో మద్యం ఎలా తయారుచేస్తున్నారో సెర్చ్ చేస్తున్నారంట.

లాక్ డౌన్ నిబంధనలతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మద్యం కోసం ఆరాటపడేవాళ్లంతా అసలు అల్కాహాల్ తయారీ ఎలాగో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారంతా.. ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్న మందుబాబులు గూగుల్ లో మద్యం ఎలా తయారు చేయాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా సెర్చ్ చేసిన క్వరీస్‌లో మద్యం తయారీ ఎలా అనే సెర్చ్ కూడా ట్రెండింగ్ అవుతోంది. మార్చి 22 నుంచి మార్చి 28 వరకు ఈ టాపిక్ గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టి.. లాక్ డౌన్ ఎత్తేసేంతవరకు మందు బాబులకు ఈ మందు కష్టాలు తప్పవని అంటున్నారు..