ఓ ప్రాణం కాపాడేందుకు…రైలుని కిలోమీటరు వెనక్కి తీసుకెళ్లిన డ్రైవర్

  • Published By: venkaiahnaidu ,Published On : April 28, 2019 / 12:38 PM IST
ఓ ప్రాణం కాపాడేందుకు…రైలుని కిలోమీటరు వెనక్కి తీసుకెళ్లిన డ్రైవర్

ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రైన్ ను కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్‌ లో జరిగింది.వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించిన రైలు డ్రైవర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.శుక్రవారం(ఏప్రిల్-26,2019) సాయంత్రం 4గంటల సమయంలో రాజస్థాన్ లోని అట్రూ-సల్పూరా రైల్వే లైన్‌ మీదుగా వెళ్తున్నఓ రైలులో నుంచి మతిస్థిమితం సరిగా లేని రాజేంద్ర వర్మ (32) అనే ప్రయాణికుడు  కిందకు దూకేశాడు. వర్మను కాపాడే ప్రయత్నంలో అతడి సోదరుడు వినోద్‌ కూడా ట్రైన్ లో నుంచి దూకేశాడు. ఈ ఘటనలో వర్మకు తీవ్రగాయాలయ్యాయి. వినోద్‌ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుల్లోని ఒకరు ట్రైన్  చైను లాగి దాన్ని ఆపి, అంబులెన్స్ కి ఫోన్‌ చేశారు. అయితే, ఆ ప్రాంతానికి అంబులెన్స్ వచ్చేందుకు దారి లేదు. ఒక కిలోమీటరు వెనక్కు వెళ్తే అక్కడి నుంచి అంబులెన్స్ లో రాజేంద్రను హాస్పిటల్ కు తీసుకెళ్లొచ్చని వైద్య సిబ్బంది ఫోన్ లో చెప్పారు.దీంతో ఆ రైలును డ్రైవర్‌ కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అంబులెన్సులో రాజేంద్రతో పాటు వినోద్‌ ను బరాన్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.