Drones Bomb Attacks: డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. ధీటైన పరిష్కారం దిశగా కేంద్రం

బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ప్రత్యక్ష కాల్పుల దశ దాటిపోయింది. ఉగ్రవాదులు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఉగ్రవాదులు చేసే దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని...

Drones Bomb Attacks: డ్రోన్లతో ఉగ్రదాడులకు ప్లాన్.. ధీటైన పరిష్కారం దిశగా కేంద్రం

Drone Bomb Attack

Drones Bomb Attacks: బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, ప్రత్యక్ష కాల్పుల దశ దాటిపోయింది. ఉగ్రవాదులు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఉగ్రవాదులు చేసే దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని అత్యంత బలమైన రక్షణ వ్యవస్థలు ఇంకా సమకూర్చుకోనే లేదు. ఈ లోపే భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు. జమ్మూ టెక్నికల్ ఎయిర్ పోర్టుపై జరిగిన డ్రోన్ల దాడే ఇందుకు నిదర్శనం.

దేశంలో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు పాల్పడడం ఇదే తొలిసారి. డ్రోన్లలో జీపీఎస్ అమర్చి కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని మరీ పేలుడు పదార్థాలు జారవిడిచారు ఉగ్రవాదులు. రిమోట్ కంట్రోల్ ద్వారా డ్రోన్స్‌ను ఆపరేట్ చేసినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనుమానిస్తోంది. ఈ ఘటనలో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం తప్పినప్పటికీ…భవిష్యత్తులో ఉగ్రవాదులు ఈ తరహాలో మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదముందని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్నాలజీ ఉగ్రవాదులకు చేరితే ఎంత ప్రమాదమో జమ్మూ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడి సూచిస్తోంది. శాంతిభద్రతల నిఘాకు పోలీసులు, భద్రతాదళాలు ఉపయోగిస్తున్న డ్రోన్లు…ఉగ్రవాదులకు చేరడం…తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్ల అమ్మకాలు, వినియోగంపై అనేక రకాల ఆంక్షలు ఉంటాయి. కానీ ఉగ్రవాదులకు అవి తేలిగ్గా అందుతున్నాయి.

పంజాబ్, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తోందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. ఆ వ్యవస్థను ఉగ్రవాదులు దాడులకు ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి.

యాంటీ డ్రోన్ టెక్నాలజీ రూపొందించుకోవడానికి భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే నావికా విభాగం…ఇజ్రాయిల్‌కు చెందిన స్మాష్ 2000 ప్లస్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఇటీవలే అందుబాటులోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన స్మార్ట్ షూటర్ సంస్థ ఈ టెక్నాలజీ అందిస్తోంది. DRDO కూడా యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ఎర్రకోటలో దీన్ని ప్రయోగించారు. అయితే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకముందే…ఉగ్రవాదులు డ్రోన్లు ఉపయోగించి దాడులు చేయడం…యావత్‌ దేశాన్నీ ఉలిక్కిపడేలా చేసింది. డ్రోన్ల దాడిపై దర్యాప్తుకు NIA బృందాలు రంగంలోకి దిగాయి.

ఉగ్రవాదుల లక్ష్యం పఠాన్‌ కోట్ తరహా దాడిగా భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట 27 నిమిషాలకు మొదటి పేలుడు జరిగింది. తర్వాత కాసేపటికే ఒంటిగంట 32 నిమిషాలకు రెండో పేలుడు జరిగింది. తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీలను డ్రోన్ల ద్వారా జారవిడిచారు ఉగ్రవాదులు. జమ్మూ టెక్నికల్ ఎయిర్‌పోర్ట్‌లోని హెలికాప్టర్ హ్యాంగర్‌కు దగ్గరలో ఈ పేలుళ్లు జరిగాయి.

ఈ ఘటనల్లో భారత వాయుసేన సిబ్బంది ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. పేలుడులో భవనం పైకప్పు స్వల్పంగా ధ్వంసమైందని, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగిందని భారత వాయుసేన ట్విట్టర్‌లో ప్రకటించింది. ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఇతర సంస్థలతో కలిసి ఈ దాడులపై IAF దర్యాప్తు చేస్తోందని ట్వీట్ చేసింది. తన ట్వీట్‌లో IAF డ్రోన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

మొదటి పేలుడు జరిగిన వెంటనే IAF పెట్రోలింగ్ సిబ్బంది..ఆ ప్రాంతానికి పరుగులు తీశారు. దీంతో కొన్ని నిమిషాలకే జరిగిన రెండో పేలుడులో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. హెలికాప్టర్ హ్యాంగర్‌కు కాస్త దూరంలో పేలుళ్లు జరిగాయని..హ్యాంగర్ లోపల పేలుడు పదార్థాలు పడితే…తీవ్ర నష్టం వాటిల్లి ఉండేదని వాయసేన వర్గాలంటున్నాయి.

టెక్నికల్ ఎయిర్‌పోర్టులో సాధారణ యుద్ధ విమానాలను ఉంచరు. Mi17 వంటి హెలికాప్టర్లు, రవాణా ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉంటాయి. డ్రోన్ల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం..యాంటీ డ్రోన్ల వ్యవస్థను సమకూర్చుకోవడంతో పాటు..సరిహద్దుల్లో కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.