ఖర్చు తక్కువ కరోనా టెస్ట్‌ ‘ఫెలుడా’ కు డీసీజీఐ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : September 20, 2020 / 08:06 PM IST
ఖర్చు తక్కువ కరోనా టెస్ట్‌ ‘ఫెలుడా’ కు డీసీజీఐ ఆమోదం

కరోనా వైరస్ ‌ను అతి తక్కువ ఖర్చులో అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలిగే ‘ఫెలుడా’ టెస్ట్‌ను వాణిజ్యపరంగా వాడేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(DCGI)ఆమోదం లభించింది. ఈ మేరకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ స్వదేశీ కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను టాటా కంపెనీ రూపొందించింది. ఇది సీఎస్‌ఐఆర్‌- ఐజీఐబీ(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ) అభివృద్ధి చేసిన సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ అనే టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. జీనోమ్‌ ఎడిటింగ్‌ ద్వారా కరోనా వైరస్‌ను గుర్తిస్తుంది.


ఎలా పనిచేస్తుంది
సాధారణంగా రియల్‌ టైం రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్ ‌- పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్ ‌(ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్షల్లో ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మారుస్తారు. సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఫెలుడా పరీక్ష కూడా ఈ ప్రక్రియ ద్వారానే ప్రారంభమవుతుంది. త‌ర్వాత‌ ప్రత్యేకంగా రూపొందించిన పీసీఆర్‌ రియాక్షన్‌ ద్వారా వైరల్‌ న్యూక్లిక్‌ ఆమ్లం సీక్వెన్స్‌ వృద్ధి చెందుతుంది.


తర్వాత ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 అనే ప్రొటీన్ ఆ సీక్వెన్స్‌కు అతుక్కుంటుంది. ఇలా ఏర్ప‌డిన బంధాన్ని గర్భనిర్ధారణ పరీక్షల తరహాలోనే పేపర్‌ స్ట్రిప్‌పై గుర్తించవచ్చు. ఈ ప్రక్రియలో ఖరీదైన రియల్ టైమ్‌ పీసీఆర్‌ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం గంట వ్యవధిలో ఈ పరీక్ష పూర్తవుతుంది.