దసరా శుభాకాంక్షలు : దుర్గతులను దూరం చేసే దుర్గమ్మ

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 08:08 AM IST
దసరా శుభాకాంక్షలు : దుర్గతులను దూరం చేసే దుర్గమ్మ

dussehra greetings : దసరా, నవరాత్రి ఉత్సవ్‌, దుర్గాపూజ, శారదోత్సవం. ఇలా పేరేదైనా కాని.. పండగ మాత్రం ఒక్కటే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగ దసరా. ప్రాంతాన్ని బట్టి, అక్కడి సంస్కృతిని బట్టి వేర్వేరుగా చేస్తున్నా.. భిన్నత్వంలో ఏకత్వం చూసిస్తున్న ఈ పండగ పరమార్థం ఒక్కటే.



విజయ శక్తిని ఆహ్వానించడం : –
దుష్టశక్తులను సంహరించి.. విజయ శక్తిని ఆహ్వానించడం. దుష్ట శిక్షణకు.. శిష్ట రక్షణకు ప్రతీక దసరా. స్త్రీ శక్తి విజయానికి నిలువెత్తు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఊరూవాడా ఏకమై ఉమ్మడిగా జరుపుకునే సంబురం. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని జనమంతా భక్తితో ఆరాధించే పండుగ. దుర్గతులను దూరం చేసే దుర్గమ్మను నవరాత్రుల్లో పూజించే వేడుక.

కోల్ కతా, మైసూరులో : –
మన దేశంలో నలుమూలలా దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. కోల్‌కతా, మైసూరు లాంటి నగరాల్లో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో తాత్కాలికంగా వెలిసే దుర్గామాత మంటపాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతాయి. శక్తి పీఠాలు, అమ్మవారి ఆలయాలు… ప్రత్యేక పూజలతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. భారత్‌ మాత్రమే కాదు.. పొరుగునే ఉన్న నేపాల్‌, శ్రీలంకలో కూడా దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతాయి.



కోల్ కతాలో : –
దసరా వేడుకల్ని కోల్‌కతాలో చూసి తీరాల్సిందే. నగరం నలుమూలలా.. వీధివీధినా.. వాడవాడలా దుర్గా మంటపాలు దర్శనమిస్తాయి. సాయంత్రం వేళల్లో ప్రతి మంటపం వద్ద భక్తజన సందోహం కిటకిటలాడుతూ ఉంటుంది. కోల్‌కతా నగరమంతా కోలాహలంగా ఉంటుంది. జగత్‌ ప్రసిద్ధి పొందిన కలకత్తా కాళీ మాతను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలి వస్తారు. కోల్‌కతాలో రెండు కాళీమాత ఆలయాలున్నాయి. ఒకటి కాళీఘాట్‌ ప్రాంతంలోని కాళీమాత ఆలయమైతే..

దక్షిణేశ్వర కాళీమాత : –
రెండోది దక్షిణేశ్వర్‌ ప్రాంతంలో హుగ్లీ నదీతీరాన వెలసిన దక్షిణేశ్వర కాళీమాత ఆలయం. కాళీఘాట్‌లో వెలసిన కాళీమాత.. కలకత్తా కాళిగా ప్రసిద్ధి పొందింది. కాళీఘాట్‌లోని కాళీమాత ఆలయం ప్రస్తుత నిర్మాణం రెండు వందల ఏళ్ల నాటిదే అయినా.. ఇది చాలా పురాతనమైంది. గుప్తుల కాలంలోనే ఇక్కడి కాళీమాత పూజలు అందుకున్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. మూడు పెద్దపెద్ద కళ్లు, పొడవాటి బంగారు నాలుకతో కనిపించే కాళీఘాట్‌ కాళీమాత రూపం విలక్షణంగా ఉంటుంది. భువనేశ్వరి మాత రూపం ఆధారంగా ఇక్కడి కాళీమాత విగ్రహానికి రూపకల్పన చేసినట్లు చెప్తారు.



భవతారిణి మాత కాళీమాత : –
ఇక.. దక్షిణేశ్వర కాళీ ఆలయం కూడా చరిత్ర ప్రసిద్ధి పొందినదే. ఈ ఆలయంలోనే పరమ భక్తుడైన రామకృష్ణ పరమహంస కాళీమాతను ఆరాధించేవారు. ఇక్కడి అధిష్టాన దేవత అయిన కాళీమాతను భవతారిణి మాత అని కూడా అంటారు. కోల్‌కతాలోని ఈ రెండు కాళీమాత ఆలయాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఊరూరా దసరా వేడుకలు : –
కోల్‌కతా మాత్రమే కాకుండా.. పశ్చిమ బెంగాల్‌లో ఊరూరా దసరా వేడుకలు సందడిగా జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లో అష్టహాస్‌, బాహులా, బక్రేశ్వర్‌, కంకాళితళా లాంటి శక్తి పీఠాల్లో దసరా నవరాత్రి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. సప్తమి, అష్టమి, నవమి, తిథుల్లో దుర్గామాతకు రకరకాల పూజలు చేస్తారు.



రెండు కథలు : –
అన్ని చోట్లా ఉన్నట్లే.. బెంగాల్‌లోనూ దసరాకు సంబంధించిన రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి మహిషాషురున్ని దుర్గాదేవి సంహరించడం. రెండోది రావణాసురున్ని రాముడు వధించడం. ఇవే జానపద కథలుగా, భజనలుగా అక్కడ ప్రసిద్ధి చెందాయి. పండగ జరిగే తొమ్మిది రోజులూ హరికథలు, బుర్రకథలు, పురాణ శ్రవణంతో రాష్ట్రమంతా సందడి సందడిగా ఉంటుంది.



ఉద్యోగులకు బోనస్ : –
ఉత్సవాల్లో చివరి రోజున.. భక్తులు కాళీమాతను దర్శిస్తారు. తొమ్మిది రోజుల పూజానంతరం ఆఖరి రోజున సముద్ర జలంలోనో, నదీ జలాల్లోనో విగ్రహ నిమజ్జనం చేస్తారు. సమైక్య భావాన్ని పెంపొందించేందుకు సహపంక్తి భోజనాల్ని ఏర్పాటు చేస్తారు. దసరాను విజయానికి శుభసూచకంగా భావిస్తారు కాబట్టి… వ్యాపారులు, సంగీతకారులు, పుస్తక విక్రేతలు.. అందరూ తమతమ కొత్త వస్తువుల్ని, పుస్తకాల్ని, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను… ఆ రోజుల్లోనే విడుదల చేస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా ప్రతి దసరాకు ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటించడంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఉత్సవ సంబరాలతో ఆనందంగా గడుపుతారు.