కోవిడ్‌-19 ఎఫెక్ట్: ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడానికి మరింత సమయం పడుతుంది, తేల్చిచెప్పిన ఆర్బీఐ

  • Published By: naveen ,Published On : August 26, 2020 / 09:50 AM IST
కోవిడ్‌-19 ఎఫెక్ట్: ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడానికి మరింత సమయం పడుతుంది, తేల్చిచెప్పిన ఆర్బీఐ

covid19 effect: ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ 19 షాక్ మామూలుగా లేదని చెప్పింది. దాని షాక్ నుంచి ఇప్పట్లో కోలుకోలేము అంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్బీఐ అంచనా వేసింది.

తిరిగి లాక్‌డౌన్ విధించడంతో తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు:
కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌లను తిరిగి విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు మరింత సమయం పడుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. కోవిడ్‌-19కు మెరుగైన చికిత్స అందుబాటులోకి రాగానే ఉద్దీపన చర్యలను ఉపసంహరించడం కీలకమని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే, జూన్‌ మాసాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపులతో పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు జులై, ఆగస్ట్‌లో తిరిగి కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో నెమ్మదించాయని తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్బీఐ చెప్పింది.

చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్:
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గినట్లు ఆర్బీఐ తెలిపింది. మే, జూన్‌ నెలల్లో ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల కనిపించిందని.. అయితే జులై, ఆగస్టులో ఈ వృద్ధి తగ్గిపోయినట్లు నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో మరోసారి విధించిన లాక్‌డౌన్‌ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో కుంగుబాటు కొనసాగుతోందని ఆర్బీఐ తెలిపింది.
https://10tv.in/german-halle-university-researchers-stage-crowded-concert-to-study-spread-of-covid-19-at-large-gatherings/
రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ మందగమనం:
ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో త్రైమాసికంలోనూ కొనసాగనుందని ఆర్బీఐ వెల్లడించింది. వినిమయ రంగానికి(consumption sector) తీవ్ర విఘాతం నెలకొందని, కరోనా మహమ్మారికి ముందున్న స్ధాయికి చేరేందుకు కొంత సమయం పడుతుందని నివేదికలో తెలిపింది. మహమ్మారితో పోరాడేందుకు ప్రభుత్వ వ్యయం వెచ్చిస్తున్నారని, డిమాండ్‌ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర పుంజుకోలేదంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధన వ్యయం(capital expenditure) వెచ్చించే పరిస్థితి లేదని తెలిపింది. పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది. కాగా, తన వార్షిక నివేదికలో ఆర్థిక వృద్ధి అంచనాలను ఆర్బీఐ వెల్లడించ లేదు.

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25 న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వలంగా సడలింపులు ఇచ్చారు. పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తివేశారు. అయితే మళ్లీ కేసులు పెరగడంతో కొన్ని రాష్ట్రాలు తిరిగి కఠినంగా లాక్ డౌన్ విధించాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావమే చూపింది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రజలు వ్యయాలను భారీగా తగ్గించుకున్నారు. ఉన్న డబ్బుని తిండికి, వైద్యానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు.