JKCA స్కామ్‌…ఫరూక్ అబ్దుల్లాని ప్రశ్నించిన ఈడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 19, 2020 / 03:19 PM IST
JKCA స్కామ్‌…ఫరూక్ అబ్దుల్లాని ప్రశ్నించిన ఈడీ

ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్‌ అసోసియేషన్‌ (JKCA) స్కామ్‌ కు సంబంధించి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్ ఫరూక్‌ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్‌ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఫరూక్ ని శ్రీనగర్ ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఈ స్కామ్ లో ఫరూక్ పాత్ర గురించి గతేడాది జులై నెలలోనే ఈడీ ఫరూక్ ని విచారించింది. కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.



అయినప్పటికీ మరోసారి విచారణ చేయాలంటూ శనివారం స్థానిక ఈడి కార్యాలయం సమన్లు జారీ చేసింది. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ.. మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు సిపిఎం నేత తరిగామి, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సజద్‌ లోన్‌, పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ నేత జావేద్‌ మిర్‌, ఇతర కశ్మీర్ నేతలు కలిసి ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించి గతవారం “గుప్కర్‌ డిక్లరేషన్‌” జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల అనంతరం ఈడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.



JKCA మాజీ సెక్రటరీ మహ్మద్ సలీమ్ ఖాన్ మరియు మాజీ కోశాధికారి అహ్సాన్ అహ్మద్ మీర్జాతో సహా మాజీ JKAC ఆఫీసు బేరర్లపై సీబీఐ బుక్ చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసుని వాచిరిస్తోంది. 2002-11మధ్య జమ్మూకశ్మీర్ లో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు BCCI.. JKACకి ఇచ్చిన డబ్బులో రూ.43.69కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2015లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఫరూక్ అబ్దుల్లా,ఖాన్, మీర్జాతో పాటు మీర్ మంజూర్ గజాన్ఫర్ అలీ, బషీర్ అహ్మద్ మిస్గర్ మరియు గుల్జార్ అహ్మద్ బీగ్ (జేకేఏసీ మాజీ అకౌంటెంట్) లపై సిబిఐ చార్జిషీట్‌ నమోదు చేసింది.

కాగా,మనీలాండరింగ్ నేపథ్యంలో ఈ కేసుని ఈడీ కూడా విచారిస్తోంది. 2005-2006 వరకు 2011-2012మధ్యలో జేకేఐసీ… రూ. 94.06కోట్లను మూడు వివిధ బ్యాంకు అకౌంట్స్ ద్వారా బీసీసీఐ నుంచి పొందినట్లు తాము దర్యాప్తు సమయంలో గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ఫరూక్ సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్‌ ఖాతాలను నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది.



అయితే, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఆరు పార్టీలు కూటమిగా ఏర్పడటంతోనే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈడీ సమన్లపై తమ పార్టీ త్వరలో స్పందిస్తుందని చెప్పారు. అయితే ఫరూక్‌ నివాసంపై ఎలాంటి దాడులు జరగలేదని వివరించారు.

బీజేపీ ఇటువంటి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతుందని తమకు తెలుసునని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. మోడీ సర్కార్‌ తమ కూటమిపై దాడి చేసేందుకు ఏజన్సీలను ఉపయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా పోరాడలేక ఇటువంటి రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.