ఎయిర్ పోర్ట్ స్కాం…జీవీకే గ్రూప్ పై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ

  • Published By: venkaiahnaidu ,Published On : July 7, 2020 / 05:47 PM IST
ఎయిర్ పోర్ట్ స్కాం…జీవీకే గ్రూప్ పై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ

ముంబై ఎయిర్‌పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED).. ముంబై విమానాశ్రయం అభివృద్ధిలో 800 కోట్ల రూపాయల విలువైన అవకతవకలకు పాల్పడినట్లు మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) సెక్షన్ 3 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను దాఖలు చేసిందని ఈడీ అధికారులు ధృవీకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా రాబోయే వారాల్లో ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. త్వరలో కంపెనీల అకౌంట్స్ ,నిధుల బదిలీని ఈడీ పరిశీలించనుంది. అలాగే దర్యాప్తులో భాగంగా ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంది.

అయితే మంగళవారం జీవీకే ప్రతినిధి మాట్లాడుతూ….మాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి ఎలాంటి నోటీసు రాలేదు అని తెలిపారు. కాగా ముంబై విమానాశ్రయం అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల దుర్వినియోగం పై జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు, మియాల్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిపై గత నెల చివర్లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో ఒప్పందం చేసుకున్నారు.ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి కోట్ల రూపాయలను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ అవినీతి కి పాల్పడినట్లు తేల్చింది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్‌ను దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలను పెంచడం ద్వారా నిధులను విత్‌డ్రా చేశారని సీబీఐ స్పష్టం చేసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అనేది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే, ఇతర విదేశీ సంస్థల జాయింట్ వెంచర్. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌‌కు 50.5 శాతం వాటా ఉండగా… ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా ఉన్నట్లు సీబీఐ విచారణ లో వెల్లడైంది.

GVK గ్రూప్ యొక్క ప్రమోటర్లు, వారి కార్యనిర్వాహకులు… ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) కు చెందిన కొందరు అధికారుల సహకారంతో మోసానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. గతవారంముంబై తో పాటు హైదరాబాద్ లో సీబిఐ అధికారులు సోదాలు చేశారు .. సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు ను స్వాధీనం చేసుకొని కీలక విషయాలు రాబట్టారు. జీవీకే చర్యల వల్ల ఏఏఐకి నష్టం వాటిల్లిందని సీబీఐ తన విచారణలో వెల్లడించింది.

జీవీకే గ్రూప్‌కి చెదిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా గ్రూప్ ఉదాసీనంగా వ్యవహరించిందని.. ఫలితంగా ఏఏఐకి నష్టం చేకూరిందని సీబీఐ తెలిపింది. ఎయిర్‌పోర్టులోని ప్రీమియం రిటైల్ ఏరియాలను కుటుంబ సభ్యులకు తక్కువ ధరకే కట్టబెట్టిందని.. ఫలితంగా అద్దెలు, అమ్మకాల రూపంలో ఎంఐఏఎల్‌కు సమకూరాల్సిన ఆదాయంపై తగ్గిందని సీబీఐ తెలిపింది.