కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : August 18, 2020 / 04:45 PM IST
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా

కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్‌ లావాసా మంగళవారం(ఆగస్టు-18,2020) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషనర్‌గా లావాసాకు ఇంకా రెండేళ్ల పదవి కాలం ఉంది. అంతేకాకుండా.. తదుపరి ప్రధాన ఎన్నికల ప్రధాన కమిషనర్ రేసులోనూ ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఈ పదవిని వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది.



ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) సునీల్‌ అరోరా 2021 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. లావాసా పదవీ కాలం అక్టోబర్‌ 2022 వరకు ఉంది. అయినప్పటికీ అశోక్‌ లావాసా తన పదవికి రాజీనామా చేశారు.

ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకే అశోక్‌ లావాసా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడీబీ ఉపాధ్యక్షుడిగా లావాసా నియామకంపై ఆ బ్యాంక్ జులై 15న ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఏడీబీ ఉపాధ్యక్షుడిగా ఉన్న దివాకర్‌ గుప్తా పదవీ కాలం ఆగస్టు 31తో ముగియనుంది.



అశోక్‌ లావాసా తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. సెప్టెంబర్‌లో ఆయన ఏడీబీలో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను ఆగస్టు 31లోగా రిలీవ్‌ చేయాలని రాజీనామా లేఖలో కోరినట్లు సమాచారం.