Elections In Jammu And Kashmir : జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు

జమ్ముక‌శ్మీర్ ఎన్నికలు నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Elections In Jammu And Kashmir : జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు

Kashmir

Elections In Jammu And Kashmir జమ్ముక‌శ్మీర్ ఎన్నికలు నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జమ్ముక‌శ్మీర్ పార్టీలతో చర్చలకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. గుప్కర్ కూటమి(జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 పునరుద్దరణ డిమాండ్ తో గతేడాది ఆగస్టులో ఒక్కటైన ఏడు కశ్మీర్ పార్టీల కూటమి) కూడా ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు త‌మ సంసిద్ధ‌త తెలిపిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రికి కూడా అధికారిక ఆహ్వానం అంద‌లేదు. డీలిమిటేషన్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటామని గుప్క‌ర్ నాయ‌కులు తెలిపారు.

కాగా,2018 జూన్‌లో పీడీపీతో పొత్తును విరమించుకుంటున్న‌ట్లు బీజేపీ ప్రకటించిన తర్వాత‌ జమ్ముక‌శ్మీర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రక్రియ లేదు. 2019 ఆగస్టులో జమ్ముక‌శ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రాన్ని జమ్ముక‌శ్మీర్, లడఖ్.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్మూ కశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లడఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు కశ్మీర్ పార్టీలకు చెందిన పలువురు నాయ‌కుల‌ను హౌజ్ అరెస్ట్‌లో ఉంచారు.

మరోవైపు,గతేడాది డిసెంబర్ లో జమ్మూ కశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ)కి జరిగిన ఎన్నికల్లో మొత్తం 280 స్థానాలకు గాను..గుప్కర్ కూటమి 100కి పైగా స్థానాల్లో విజయం సాధించగా.. 74 స్థానాల్లో బీజేపీ గెలిచి రాష్ట్రంలో అతి పెద్ద ఏకైక పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక ఇన్నిరోజుల త‌ర్వాత తిరిగి ఎన్నిక‌ల ఊసెత్త‌డంతో రాజ‌కీయ పార్టీల్లో ఉత్సాహం మొద‌లైంది. అయితే కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చిన తరుణంలో ఈ ఎన్నిక‌ల చ‌ర్చ‌ల‌కు కేంద్రం ముందుకొచ్చిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.