గజరాజులపై పైశాచికత్వం: మండుతున్న టైరుతో ఏనుగును చంపేశారు

గజరాజులపై పైశాచికత్వం: మండుతున్న టైరుతో ఏనుగును చంపేశారు

Elephant dies : కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ ఏనుగు ప్రాణం తీసింది. ఏనుగును బెదిరించేందుకు మండుతున్న టైరును ఏనుగు వైపు విసిరారు. మండుతున్న టైరు ఆ ఏనుగు చెవులకు చిక్కుకోవడంతో… మంటల్లో తీవ్రంగా గాయపడింది… చికిత్స పొందుతూ ఆ ఏనుగు చివరకు మరణించింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి అటవీ ప్రాంతం ఏనుగులుకు ప్రసిద్ధి. ఇక్కడ మాసినగుడి అనే గ్రామంలోకి రాత్రి పూట ఏనుగు ప్రవేశించింది.

అయితే ఏనుగును బెదిరించేందుకు కొందరు వ్యక్తులు టైరుకు నిప్పు పెట్టి.. దాన్ని ఏగును మీదకు విసిరారు. నేరుగా ఆ టైరు ఏనుగు తల మీద నుంచి కిందకు జారి చెవులకు చిక్కుకుంది. మంటలకు తాళలేక ఏనుగు అడవిలోకి పరుగులు తీసింది. అయితే చెవులకు చిక్కుకున్న టైరు కింద పడకపోవడంతో…. ఏనుగు చెవులు, తల, వీపు భాగం తీవ్రంగా కాలిపోయింది. మంటల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏనుగును గుర్తించిన అటవీ సిబ్బంది వైద్య చికిత్స అందించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ ఏనుగు చనిపోయింది.

ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు విచారణ చేయగా రిక్కీ ర్యాన్‌, రేమండ్‌ డీన్‌, ప్రశాంత్‌ అనే వ్యక్తులు ఏనుగుకు నిప్పు పెట్టినట్టుగా తేలింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు అరెస్ట్‌ కాగా ఒకరు పరారీలో ఉన్నారు. నిందితుల దగ్గర నుంచి ఏనుగుకు నిప్పు పెట్టిన వీడియోను సేకరించారు. నెట్టింట్లో ఆ వీడియో చూసిన వారు ఈ ఘాతుకంపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.