Anti Covid Drug 2-DG : మేడిన్ హైదరాబాద్.. కరోనాకు మరో ఔషధం.. ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది, త్వరగానే కోలుకుంటారు

కరోనా రోగులకు చికిత్స కోసం మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్‌మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలు సంయుక్తంగా దీనిని

Anti Covid Drug 2-DG : మేడిన్ హైదరాబాద్.. కరోనాకు మరో ఔషధం.. ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది, త్వరగానే కోలుకుంటారు

Anti Covid Drug 2 Dg

Anti Covid Drug 2-DG : కరోనా రోగులకు చికిత్స కోసం మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్‌మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఈ ఔషధాన్ని 2-డీజీ (డీయోక్సీ-గ్లూకోజ్) గా పిలుస్తున్నారు. 2-డీజీ డ్రగ్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ ఔషధాన్ని కరోనా రోగుల చికిత్స వినియోగానికి అనుమతించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. కరోనాతో బాధపడే రోగులకు ఈ ఔషధంతో తక్షణం ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌ సోకిన కణాలతో పాటు, శరీరంలో వైరస్‌ వేగంగా వ్యాపించకుండా అడ్డుకుంటుందని డీఆర్‌డీవో తెలిపింది. ఈ డ్రగ్ వాడిన రోగులకు ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ గా తేలుతోంది.

గత ఏడాది ఏప్రిల్ లో సీసీఎంబీ సహకారంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగాలు నిర్వహించారు. సార్స్-కోవి-2 వైరస్‌పై ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. ఈ ఫలితాల ఆధారంగా డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లు 2-డీజీ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు మే 2020లో అనుమతించాయి. మే నుంచి అక్టోబరు వరకు క్లినికల్ ట్రయల్స్ కొనసాగాయని, ఈ ఔషధం తీసుకున్న కోవిడ్ బాధితులు త్వరగా కోలుకున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా 17 ఆస్పత్రుల్లో 110 మందికి ఈ ఔషధం అందజేశారు. సాధారణ చికిత్సతో పోల్చితే ఈ ఔషధం తీసుకున్న వారు రెండున్నర రోజుల ముందే కోలుకున్నట్టు తేలింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు నవంబర్ లో అనుమతి రాగా.. డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఢిల్లీ, యూపీ, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 27 ఆస్పత్రుల్లో 220 మంది రోగులకు 2-డీజీ ఔషధం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటాను డీసీజీఐకి మే 1న సమర్పించి అత్యవసర వినియోగానికి అనుమతి కోరింది. ఫలితాలను సమీక్షించిన డీసీజీఐ ఆమోదం తెలిపింది. 2-డీజీ ఔషధం పౌడర్‌ రూపంలో లభించనుంది. నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.