మాస్క్‌ రేట్లు పెంచితే తాట తీస్తాం: కేంద్రమంత్రి వార్నింగ్ 

  • Published By: vamsi ,Published On : March 4, 2020 / 10:25 AM IST
మాస్క్‌ రేట్లు పెంచితే తాట తీస్తాం: కేంద్రమంత్రి వార్నింగ్ 

నిన్నమొన్నటివరకు చైనాలో గజగజ వణికించిన కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించినట్లుగా వస్తున్న వార్తలు కంగారు పెట్టేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సంధర్భంగా మార్కెట్లో ఎన్‌–95 మాస్కుల రేట్లను పెంచడంపై మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు అధికారులు. అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపిస్తామని హర్షవర్దన్‌ తెలిపారు.

దేశ వ్యాప్తంగా 28 కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్.. ఆగ్రాలో 6, కేరళలో 3, ఢిల్లీలో 1, తెలంగాణలో మరొక కరోనా కేసు నమోదైందని తెలిపారు. 16 మంది ఇటాలియన్లతో పాటు డ్రైవర్‌కు కరోనా సోకినట్టు చెప్పుకొచ్చారు. ఇటలీ పర్యాటకులను ఐటీబీపీ శిబిరానికి పంపినట్లు చెప్పారు.

ఢిల్లీలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబానికి కూడా వైరస్‌ పాజిటీవ్‌గా తేలిందని చెప్పారు. తెలంగాణలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిశాడని వారందరినీ గుర్తించి పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 438 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు చెప్పారు.