EPFO Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ షాక్.. వడ్డీ రేట్లలో భారీ కోత

పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేట్లను(EPFO Interest Rate) భారీగా తగ్గించింది.

EPFO Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ షాక్.. వడ్డీ రేట్లలో భారీ కోత

Epfo Interest Rate

EPFO Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) బిగ్ షాక్ ఇచ్చింది. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఏకంగా 40 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీ రేట్లను తగ్గించింది. 2021–22కి గానూ వడ్డీ రేట్లను 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అది 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావం పడనుంది. సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, దానిని దృష్టిలో పెట్టుకునే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైకేల్ డయాస్ చెప్పారు.(EPFO Interest Rate)

కార్పస్ ఫండ్ ఆదాయం 13 శాతం పెరిగిందని.. కానీ, ఆదాయంపై వడ్డీ మాత్రం 8 శాతమే ఉందని మరో సభ్యుడు కేఈ రఘునందన్ చెప్పారు. 8.1 శాతం వడ్డీ చెల్లించాక ఈపీఎఫ్ దగ్గర మిగులు రూ.450 కోట్లు ఉంటుందని తెలిపారు.

కాగా, 1977–78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది పీఎఫ్ పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018–19, 2016–17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. 2013–14, 2014–15లో 8.75 శాతం, 2015–16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. కరోనా సమయంలో నగదు ఉపసంహరణలు పెరగడంతో, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019–2020కిగానూ 8.5 శాతానికి తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరం కూడా అంతే వడ్డీని ఇచ్చారు. ఇప్పుడు మరింత కోత విధించారు.(EPFO Interest Rate)

EPFO Customers Alert : మీ పీఎఫ్‌ అకౌంట్లో ఈ-నామినేషన్ చేయలేదా? రూ.7 లక్షలు పోయినట్టే..!

ఈ ఏడాదైనా ఎక్కువ వడ్డీ వస్తుందని పీఎఫ్ ఖాతాదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈపీఎఫ్ఓ నిరాశ మిగిల్చింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు గాను ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో నిల్వ చేసిన డబ్బుపై 8.1 వడ్డీని పొందుతారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులకు 0.40 శాతం వడ్డీ తగ్గనుంది.

కాగా, పీఎఫ్ ఖాతాదారులు.. ఎస్ఎంఎస్, ఉమాంగ్‌ యాప్‌, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌, మిస్డ్‌ కాల్‌ ద్వారా తమ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌వో పోర్టల్‌: ఈపీఎఫ్ఓ సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్‌ సర్వీసెస్‌’లోని ‘మెంబర్‌ పాస్‌బుక్‌’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం కోసం మరో పేజీకి రీ-డైరెక్ట్‌ అవుతుంది. వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా ఖాతాలో వివరాలు తెలుసుకోవచ్చు.

మిస్డ్ కాల్ స‌ర్వీస్‌: ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత ఓ రింగ్‌ అయి వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వివరాలు వస్తాయి.

ఉమాంగ్‌ యాప్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్‌ యాప్‌లోని ఈపీఎఫ్‌వోను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్‌’ను క్లిక్‌ చేయాలి. అప్పుడు యూఏఎన్‌ నంబర్‌తో పాటు మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్‌ ఐడీని క్లిక్‌ చేయడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్‌ ఖాతాతో మొబైల్‌ నంబర్‌ ముందే జత చేసి ఉండాలి.

ఎస్ఎంఎస్ ద్వారా: యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్‌ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్ఎంఎస్ పంపించాలి.