బ్రేకింగ్ : 370రద్దు తర్వాత…తొలిసారిగా కశ్మీర్ కు ఈయూ పార్లమెంట్ బృందం

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2019 / 07:56 AM IST
బ్రేకింగ్ : 370రద్దు తర్వాత…తొలిసారిగా కశ్మీర్ కు ఈయూ పార్లమెంట్ బృందం

కశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందం పర్యటించేందుకు అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం మంగళవారం(అక్టోబర్-29,2019) జమ్మూకశ్మీర్ లో పర్యటించనుంది. ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ తో ఈ బృందం సమావేశం కానుంది. కశ్మీర్ లో పరిస్థితులను ఈ బృందానికి మోడీ,దోవల్ వివరించనున్నారు.

ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వ్యాలీలో ఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఒక్కొక్కటిగా కశ్మీర్ లో ఆంక్షలను సడలిస్తుంది ప్రభుత్వం. అదుపులోకి తీసుకున్న పలువురు నాయకులను వదిలిపెట్టారు.

అయితే అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ,ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరు నాయకులను వెంటనే రిలీజ్ చేయాలని భారత్ ను ఇటీవల అమెరికా కోరింది. కశ్మీర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు అంతర్జాతీయ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ దేశ పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వైట్ హౌస్ తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల పోస్ట్ పెయిడ్ సర్వీసులను వ్యాలీలో పునరుద్దరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ ఆరోపణలు చేయడం,దానికి అమెరికా వంత పాడటం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కళ్లారా ప్రపంచానికి చూపించేందుకు విదేశీ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు భారత్ అనుమతించింది.