ముస్లింలు ఓటు వేయకున్నా…వారి కోసం పనిచేస్తా

  • Published By: venkaiahnaidu ,Published On : April 22, 2019 / 02:22 AM IST
ముస్లింలు ఓటు వేయకున్నా…వారి కోసం పనిచేస్తా

ముస్లింలు తనకు ఓటు వేయకపోయినా వారి కోసం తాను పనిచేస్తానని కేంద్రమంత్రి మేనకాగాంధీ తనయుడు, ఫిలిబిత్ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఫిలిబిత్ నియోజకవర్గంలోని సుల్తాన్‌ పూర్ లో  జరిగిన ర్యాలీలో ముస్లిం ఓటర్లను ఉద్దేశించి వరుణ్ గాంధీ మాట్లాడుతూ….ముస్లిం సోదరులకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను.మీరు నాకు ఓటేస్తే చాలా బాగుంటుంది, ఒకవేళ మీరు నాకు ఓటేయకున్నా నాతో పనులు చేయించుకోవచ్చు..ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.ముస్లింలు నాకు ఓటు వేయలేదు అనే విషయాన్ని మనసులో పెట్టుకోను అని వరుణ్ గాంధీ అన్నారు. 

కొద్ది రోజుల క్రితం వరుణ్ గాంధీ తల్లి, కేంద్రమంత్రి మేనకాగాంధీ ఇటీవల ముస్లిం ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ముస్లింలు తనకు ఓటు వెయ్యకపోతే వారి గురించి తాను పట్టించుకోనని, తాను ఎన్నికయ్యాక వారికి ఎలాంటి సాయం చేయనని మేనకాగాంధీ అన్నారు. ముస్లింల విషయంలో తల్లి ప్రకటనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వరుణ్ గాంధీ వార్తల్లో నిలిచారు.