India Covid – 19 : భారతదేశంలో కరోనా కల్లోలం, కొత్తగా 1.31 లక్షల కేసులు, 802 మంది మృతి

భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది.

India Covid – 19 : భారతదేశంలో కరోనా కల్లోలం, కొత్తగా 1.31 లక్షల కేసులు, 802 మంది మృతి

COVID-19 cases

Corona: భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది. వైరస్ కారణంగా.. పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1.31 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూడగా..802 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 9.74 లక్షలుగా ఉన్నాయి.

మహారాష్ట్రలో 56 వేల 286, ఛత్తీస్ గడ్ లో 10 వేల 652, ఉత్తర్ ప్రదేశ్ లో 8 వేల 474, ఢిల్లీ 7 వేల 437, కర్నాటకలో 6 వేల 570, కేరళలో 4 వేల 353, మధ్యప్రదేశ్ లో 4 వేల 324, తమిళనాడులో 4 వేల 276, గుజరాత్ లో 4 వేల 021 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు అమలు చేస్తున్నారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు అధికమౌతున్నాయి. గత 24 గంటల్లో 7 లక్షల 33 వేల 185 కేసులు రికార్డవగా…13 వేల 774 మంది చనిపోయారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 32 లక్షల 86 వేల 407 యాక్టివ్ కేసులున్నాయి.

ఢిల్లీ ఆసుపత్రుల్లో అలజడి :-
ఢిల్లీలో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఆస్పత్రులోనూ అలజడి రేపుతోంది. వరుసగా డాక్టర్లు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని ప్రముఖ గంగారామ్‌ ఆస్పత్రిలో 37 మంది డాక్టర్లుకు వైరస్ సోకింది. దీంతో
వారందరిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన డాక్టర్లుకు సన్నిహితంగా ఉన్న ఇతర డాక్టర్లతో పాటు.. వైద్యసిబ్బందికి కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. వారందరిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు.

లాక్ డౌన్ లేదన్న మోదీ : –
దేశంలో కరోనా పీక్స్‌కు చేరుతోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌ మరింతగా టెన్షన్‌ పెట్టిస్తోంది. దీంతో మరోసారి లాక్‌డౌన్‌ తప్పదన్న వార్తలు ఊపందుకున్నాయి. సోషల్‌ మీడియాలో అయితే రకరకాల ప్రచారాలు సాగాయి. ఇక లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడుతుందన్న వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ చెక్‌ పెట్టారు ప్రధాని మోదీ. మరోసారి లాక్‌డౌన్‌ పెట్టేది లేదంటూ తేల్చిచెప్పారు.