శశికళకు చెందిన రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు 

  • Published By: chvmurthy ,Published On : November 6, 2019 / 04:51 AM IST
శశికళకు చెందిన రూ.1600 కోట్ల ఆస్తులు జప్తు 

తమిళనాడు మాజీ సీఎం జయలలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన రూ.1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం జప్తు చేసారు.2016 నవంబర్ లో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చెన్నై, పుదుచ్చేరిల్లో వేర్వేరు చోట్ల 9 ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 

దాదాపు రూ.1500 కోట్ల రద్దైన నోట్లతో శశికళ బినామీ పేర్లతో ఈ ఆస్తులను కొన్నట్లు అధికారులు నిర్ధారించారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు చిన్నమ్మగా ఆమె చక్రం తిప్పారు. భారీగా అక్రమ ఆస్తుల కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే మీద పట్టుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినా.. ఆ తర్వాత పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో వీకే శశికళ, ఆమె మేనల్లుడు సొంత పార్టీ పెట్టుకున్నారు.

2017లో ఐటీ అధికారులు శశికళతో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై భారీగా దాడులు చేశారు. చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో ప్రస్తుతం జప్తు చేసిన ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. దీంతో విచారణ చేసిన అధికారులు వాటిని జప్తు చేశారు.