బ్యాక్ టు పెవిలియన్ : 8సార్లు ఎంపీకి టిక్కెట్ ఇవ్వని బీజేపీ

జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.1989,1991,1996,1998,1999,2009,2014లోక్ సభ ఎన్నికల్లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించిన ఆయన1977లో దివంగత ప్రధాని మొరార్జీదేశాయ్ కేబినెట్ లో ఉక్కుశాఖ మంత్రిగా పనిచేశారు.

15వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.వాజ్ పేయి మంత్రివర్గ సభ్యుడిగా కూడా సేవలందించిన ఆయనకు వయసు మీదపడిందనే నెపంతో బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.మాజీ సీఎం అర్జున్ ముండాకు ఖూంటీ సీట్ ని బీజేపీ కేటాయించింది.మూడు సార్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన అర్జున్ ముండా 2009లో జంషెడ్ పూర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

బీజేపీ టిక్కెట్ కేటాయించకపోవడంపై కరియా ముండా మాట్లాడుతూ…వ్యవసాయం చేస్తూనే పార్లమెంటు సభ్యుడినయ్యాను. ఇప్పుడు టిక్కెట్ దక్కలేదు. తిరిగి వ్యవసాయంపై దృష్టిపెడతాను. ఇది బ్యాక్ టు పెవిలియన్. రాజకీయాలనేవి ప్రజాసేవ చేసుకునేందుకు మార్గంగా కనిపించాయి. భగవంతుడు అడగకుండానే అన్నీ ఇచ్చాడు. నేను ఏ పదవి కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదు. నేను పార్టీకి నిజమైన కార్యకర్తను. పార్టీ నాకు ఎటువంటి బాధ్యతను అప్పగించినా తప్పక నెరవేరుస్తానని తెలిపారు.