పౌరసత్వ సవరణ బిల్లు…ఈ ప్రాంతాలకు మినహాయింపు!

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 11:31 AM IST
పౌరసత్వ సవరణ బిల్లు…ఈ ప్రాంతాలకు మినహాయింపు!

ఇవాళ(నవంబర్-4,2019) కేంద్రమంత్రివర్గం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు పరిధి నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు లభించింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లోని ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాలకు ఈ బిల్లు వర్తించదు. భారత పౌరులు కొన్ని రాష్ట్రాల్లోని రక్షిత ప్రాంతాల్లో ప్రయాణించేందుకు భారత ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రయాణ ధ్రువపత్రాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. అదేవిధంగా రాజ్యాంగంలోని 6వ షెడ్యూలులో పేర్కొన్న ఈశాన్య భారత దేశంలోని ప్రాంతాలకు కూడా ఈ బిల్లు రక్షణ కల్పించింది. 

రాజ్యాంగంలోని 6వ షెడ్యూలులో చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలకు, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్, 1873 ప్రకారం నోటిఫై చేసిన ఇన్నర్ లైన్ క్రిందకు వచ్చే ప్రాంతాలకు ఈ సెక్షన్‌లో ఉన్నదేదీ వర్తించదని ముసాయిదా బిల్లు తెలిపింది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నవారు ప్రధానంగా 6వ షెడ్యూలు, ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 6ఏ-కు ఈ నిబంధనను జత చేశారు. గతంలో లోక్‌సభలో ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ బిల్లులో 6వ షెడ్యూలు, ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాలకు ఈ రక్షణ లేదు. 

బంగ్లాదేశ్, పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశంలోకి 2014 డిసెంబరు 31నాటికి ప్రవేశించిన హిందూ, సిక్కు, జైన, క్రైస్తవ,పార్శీ,బౌద్ధ మతాలకు చెందిన వ్యక్తులను అక్రమ వలసదారులుగా పరిగణించబోమని ఈ బిల్లు చెప్తోంది.