కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

  • Published By: bheemraj ,Published On : June 8, 2020 / 06:52 PM IST
కరోనా పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు కరోనా పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ జరుగుతోంది. దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా వైరస్ టెస్టులకు 4 వేల 500 రూపాయలకు మించి ఫీజు వసూలు చేయరాదని.. శానిటైజర్లకు, సర్జికల్ మాస్కులు రెండింటికి కలిపి రూ.400 లకు మించి తీసుకోరాదని భారతీయ వైద్య పరిశోధన మండలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కరోనా పేషెంట్లను ఆస్పత్రుల్లో చేర్చుకుంటే ఎంత ఫీజు, వారు వేసుకునే ఎన్-95 మాస్కులకు ఎంత ఫీజు, గాగుల్స్ కు ఎంత ఫీజు, డిశ్చార్జ్ అయ్యే నాటికి ఎంత ఫీజు మించకూడదో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ, కోర్టుల నుంచి గానీ ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం శోచనీయం. 

దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని జన్ స్వస్థ్య అభియాన్ కు చెందిన ఆరోగ్య కార్యకర్త ఇనియత్ సింగ్ కాకర్ ఆరోపించారు. పేషెంట్లు ఏ రోగంతో ఆస్పత్రులు వెళ్లినా కరోనా టెస్టులు తప్పనిసరి చేయించాలంటున్నారు. కరోనా లేదని తేలినా ముందు జాగ్రత్త అంటూ మాస్కులు ఇస్తూ భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

గతంలో కిడ్నీ రోగాలతో బాధపడుతున్న వారికి ఒకసారి డయాలసిస్ కు రూ.25,000 చొప్పున వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులు..ప్రస్తుతం రూ.35, 0000 నుంచి రూ.40,000 వరకు వసూలు చేస్తున్నాయని తెలిపారు.