ముందు శాంతి తర్వాతే ద్వైపాక్షిక సంబంధాలు..చైనాకు తేల్చిచెప్పిన భారత్

ముందు శాంతి తర్వాతే ద్వైపాక్షిక సంబంధాలు..చైనాకు తేల్చిచెప్పిన భారత్

INDIA-CHINA చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్​ గురువారం ఫోన్​లో 75 నిమిషాల పాటు మాట్లాడారు.

మళ్లీ తిరిగి టచ్ లోనే ఉండేందుకు ఇద్దరు మంత్రులు అంగీకరించారని మరియు సమస్యను పరిష్కరించేలా ఇరు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను పంచుకునేందుకు ఓ హాట్ లైన్ ఏర్పాటుకు ఇద్దరు నేతలు అంగీకరించారని శుక్రవారం ఉదయం భారత విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. చైనాతో గడిచిన ఏడాది ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డ్రాగన్ దేశానికి చెప్పినట్లు ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తెలిపింది.

ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఇంకా సమయం పడుతుందని జై శంకర్ తెలిపారు. కానీ సరిహద్దులో ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని స్పష్టం చేశారు. తూర్పు లడఖ్ లో అన్ని ఫ్రిక్షన్​ పాయింట్ల నుంచి బలగాల ఉపసంహణ పుర్తయ్యాకే సరిహద్దులో ఉద్రిక్తలు తగ్గి గతంలా శాంతిని నెలకొల్పేందుకు వీలుంటుందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్​ యీకి సృష్టం చేశారు.

జైశంకర్​తో ఫోన్ సంబాషణకు సంబంధించి చైనా విదేశాంగ మంత్రి వాంగ్​యీ కూడా ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసం, సహకారంతో సరైన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. పొరుగు దేశాల మధ్య అనుమానం, అపనమ్మకం ఉంటే ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారకుండా ఉండాలంటే సరిహద్దు సమస్యను సరిగ్గా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా, సరిహద్దులో 9నెలలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభణ తొలగించేందుకు గతవారం తూర్పు లడఖ్ లోని పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాలు తమ బలగాలు, ఆయుధాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. పాంగాంగ్​ సరస్సు వద్ద మొదటి దశ బలగాల ఉపంసంహరణ పూర్తైన నేపథ్యంలో మిగతా సమస్యలపై దృష్టి సారించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.