ఫేస్‌బుక్ యూజర్ల సెక్యురిటీ కోసం కొత్త ఫీచర్‌

  • Published By: vamsi ,Published On : May 21, 2020 / 02:55 PM IST
ఫేస్‌బుక్ యూజర్ల సెక్యురిటీ కోసం కొత్త ఫీచర్‌

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. భారతీయ వినియోగదారులకు గురువారం(21 మే 2020) నుంచి అందుబాటులోకి వచ్చింది. తమ ప్రొఫైల్‌ను లాక్ చేయటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. 

భారతీయ వినియోగదారుల భద్రతపై దృష్టి పెట్టిన ఫేస్‌బుక్.. ముఖ్యంగా మహిళలు వారి ప్రొఫైల్‌లపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండేందుకు ఈ ఫీచర్‌ను తీసుకుని వచ్చింది. స్నేహితులు కానివారు ప్రొఫైల్ ఫోటోలను డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయడం లేదా జూమ్ చేయడం లేదా లాక్ చేసిన ప్రొఫైల్‌ల కవర్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడం వంటివి చెయ్యకుండా ఈ ఫీచర్ పనికొస్తుంది.

లాక్ ఫీచర్ స్నేహితుల జాబితాలో లేని వ్యక్తులను లాక్ చేసిన ఆ ప్రొఫైల్‌ల టైమ్‌లైన్‌లో పోస్ట్‌లను చూడకుండా పరిమితం చేస్తుంది. ఫేస్బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ మాట్లాడుతూ.. “ప్రజలు తమను తాము సెక్యూర్ చేసుకునేందుకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చామని, భారతదేశంలోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ ఆన్‌లైన్ ప్రొఫైల్‌ను రక్షించడం కోసం మేము క్రొత్త ఫీచర్‌ను తీసుకుని వచ్చామ” అని చెప్పారు.

లాక్ ఫీచర్ ప్రారంభించబడిన తర్వాత, వినియోగదారు ప్రొఫైల్ లాక్ చేయబడిందని చూపిస్తుంది. ఈ లక్షణాన్ని ప్రారంభించిన తర్వాత వారి పోస్ట్‌లను ప్రజలు చూడలేరు. షేర్ చేయలేరు. వారి పోస్ట్‌లను ఫ్రెండ్ లిస్ట్‌లోని వారు మాత్రమే చూడగలరు.