ఫేస్ బుక్ ప్రేమ.. పగగా మారి: ప్రియుడిని చంపేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు

  • Published By: vamsi ,Published On : November 30, 2019 / 01:23 PM IST
ఫేస్ బుక్ ప్రేమ.. పగగా మారి: ప్రియుడిని చంపేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు

ఇటీవలికాలంలో యూత్ ఫేస్ బుక్‌లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్‌గా తమిళనాడు రాష్ట్రంలోని థేనిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయగా.. చివరకు ప్రియురాలు ప్రియుడిని చంపేందుకు స్కెచ్ వేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని థేని జిల్లా కాట్టు నాయకన్‌పట్టికి చెందిన 28ఏళ్ల అశోక్‌కుమార్ బెంగుళూరులో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఫేస్‌బుక్‌లో మలేషియాకు చెందిన అముదేశ్వరి అనే 48ఏళ్ల మహిళ పరిచయం అయ్యింది.  ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని అముదేశ్వరి కోరింది.

అయితే ఇద్దరి మధ్య వయస్సు గ్యాప్ ఉండడంతో పెళ్లికి నిరాకరించాడు అశోక్ కుమార్. దీంతో కవిత అనే యువతి అముదేశ్వరికి అక్క అని చెబుతూ అశోక్‌కుమార్‌కు ఫోన్‌ చేసింది. వివాహం చేసుకోకపోతే అముదేశ్వరి ఆత్మహత్య చేసుకుంటానని అంటుంది అని చెప్పింది. అలాగే, అశోక్‌కుమార్‌ పని చేసే ఆఫీస్‌కి కూడా ఇదే విషయాన్ని మెయిల్ చెయ్యడంతో సంస్థ యాజమాన్యం అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో అతను స్వ గ్రామానికి చేరుకున్నాడు.

ఒక రోజు హఠాత్తుగా అశోక్‌కుమార్‌ ఇంటికి వచ్చిన కవిత, తనను పెళ్లిచేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇందుకు కారణం నీవేనని సూసైడ్‌ నోట్‌ రాస్తానంటూ గోల చేసింది. దీంతో భయపడిన అశోక్‌కుమార్‌ థేని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అముదేశ్వరి, కవిత పేరుతో మాట్లాడింది ఒకే యువతి అని గుర్తించారు. అనంతరం కవిత పాస్‌పోర్ట్‌ను పరిశీలించగా, ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి. వయస్సు 48ఏళ్లు అని తేలడంతో అమెను తిరిగి మలేషియాకు పంపించారు. 

దీంతో కక్ష పెంచుకున్న విఘ్నేశ్వరి అశోక్ కుమార్‌ని చంపేందుకు కిరాయి ముఠాను ఆశ్రయించింది. ఫేస్‌బుక్‌ ద్వారా థేని జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకొని అశోక్‌కుమార్‌ను హతమార్చేందుకు ప్లాన్ చేసంది. దీంతో 9 మంది ముఠా ఏర్పాటైంది. వారికి అతని ఫొటో, వివరాలను పంపించింది. దీంతో అశోక్‌ను చంపేందుకు ప్లాన్ చేసుకున్న ముఠా ఓ లాడ్జిలో బస చేసేందుకు దిగింది. 

అయితే అనుమానించిన లాడ్జి ఓనర్ పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి వీరిని అరెస్ట్ చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ అయినవారిలో మదురై అవనియాపురంకు చెందిన అన్బరసన్‌ (24), కుళిదికి చెందిన మును స్వామి (21), అయ్యనార్‌ (39), రామేశ్వరంకు చెందిన జోసఫ్‌ (20), తేని అల్లింకరైకు చెందిన యోగేష్‌ (20), కార్తీక్‌ (21), దినేష్‌ (22), విళయాంపట్టికి చెందిన భాస్కరన్‌ (48) సహా 9 మంది ఉన్నారు. విఘ్నేశ్వరిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.