కంప్లైంట్ ఇచ్చి బుక్కైయ్యాడు :ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 06:00 AM IST
కంప్లైంట్ ఇచ్చి బుక్కైయ్యాడు :ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్

శంకర్ దాదా Mbbs డాక్టర్ బాగోతం బైటపడింది. డాక్టర్ నంటూ ఏకంగా పదేళ్ల నుంచి వేలకొద్దీ ఆపరేషన్లు చేసేశాడు. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఈ ఫేక్ డాక్టర్ బాగోతం ఉత్తరప్రదేశ్ లోని దేవ్‌బంద్ సిటీలో బైటపడింది. 

యూపీలోని సహరాన్ పూర్ జిల్లాలోని దేవ్ బంద్ సిటీ. ఓంపాల్ మిశ్రా అనే వ్యక్తి డాక్టరు అవతారం ఎత్తాడు.  ఫేక్ సర్టిఫికెట్ తో ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్‌సిలోనే మకాం పెట్టేశాడు. అలా 10 సంవత్సరాల నుంచి ఒకటీ రెండూ కాదు ఏకంగా వేల సంఖ్యలో ఆపరేషన్లు కూడా చేసే’సాడు. ఎట్టకేలకూ ఓంపాల్ మిశ్రా గుట్టు రట్టైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే.. ఓంపాల్ 2000 సంవత్సరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పారామెడిక్ గా పనిచేశాడు. తరువాత డిఫెన్స్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నాడు. అనంతరం మంగళూరు సిటీలో డాక్టర్ రాజేష్ ఆర్ ఆసుపత్రిలో అతనితో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో డాక్టర్ రాజేశ్ విదేశాలకు వెళ్లాడు. 

దీంతో డాక్టర్ రాజేశ్ డిగ్రీ సర్టిఫికెట్‌ను క్లోనింగ్ చేసి ఓంపాల్ తన ఫోటో పెట్టుకున్నాడు. తన ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ చూపించి యూపీలో మెడికల్ ప్రాక్టీస్ చేసే వ్యక్తిగా తన పేరును డాక్టర్ రాజేష్ శర్మగా మార్చుకున్నారు.  అనంతరం దేవ్ బంద్ సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్‌‌లో డాక్టర్ గా చేరిపోయాడు. ఇలా గత 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. ఈ పదేళ్లలో వేలకొద్దీ సర్జరీలు చేశాడు. 

నేరం ఎక్కువ కాలం దాగదు అన్నట్లు..ఈ ఫేక్ డాక్టర్ ఓంపాల్ మిశ్రాను ఒక వ్యక్తి అనుమానించాడు. ఆఖరికి రూఢీ చేసుకున్నాడు. తరువాత సదరు వ్యక్తి ఓంపాల్ ను బ్లాక్ మెయిట్ చేశాడు. నీగుట్టు అంతా నాకు తెలిసి పోయింది. అది బైట పెట్టకుండా ఉండాలంటే నాకు రూ.40లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. దీంతో  ఓంపాల్ అలియాస్ డాక్టర్ రాజేశ్ శర్మ పోలీసులను కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ  నకిలీ డాక్టరు బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్ పై కాదు..కాదు ఫేక్ డాక్టర్ పైనే కేసు నమోదు చేయాల్సి వచ్చింది. తరువాత నకిలీ డాక్టరు అయిన ఓంపాల్ మిశ్రాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.