ఇదీ నిజం : ఇందిరా, కిరణ్ బేడీ వైరల్ ఫొటో వెనుక స్టోరీ ఏంటంటే

  • Published By: venkaiahnaidu ,Published On : April 23, 2019 / 05:29 AM IST
ఇదీ నిజం : ఇందిరా, కిరణ్ బేడీ వైరల్ ఫొటో వెనుక స్టోరీ ఏంటంటే

నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రం…1982లో నిబంధనలకు వ్యతిరేకంగా కారు పార్క్ చేసినందుకు ప్రధాని కారుకే చలానా విధించిన కిరణ్ బేడీని అభినందించడానికి ఇందిర స్వయంగా తన కార్యాలయానికి భోజనానికి పిలిచారని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అనే పేరుతో ఉన్న ఓ ట్విటర్ యూజర్ ఓ ఫొటోను షేర్  చేశారు. ఇదే మోడీ – ఇందిరకు తేడా అంటూ కిరణ్ బేడీ, ఇందిర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోనూ ఫేస్‌బుక్, ట్విటర్‌లలో వేలాదిమంది షేర్ చేసుకున్నారు.

ఇదీ నిజం :

1982లో ఢిల్లీ పోలీసులు నో పార్కింగ్ జోన్‌లో ఉన్న ఇందిర కారుకు చలానా విధించి తీసుకెళ్లారు. ఆ సమయంలో కిరణ్ బేడీ ట్రాఫిక్ విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. అయితే ఈ ఫొటో నిజమే కానీ.. దానితో కలిపి చెబుతున్న సందర్భం మాత్రం నిజం కాదు. 1982 నాటి ఘటనకు, ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదు. ఇందిరాగాంధీతో గడిపిన క్షణాలు.. 1975లో రిపబ్లిక్ డే పరేడ్‌కు నేతృత్వం వహించిన నన్ను చూసిన ఇందిర బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారంటూ కిరణ్ బేడీ 2014లో ఈ ఫొటోను ట్విటర్‌ లో షేర్ చేశారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో 1975 నాటిది. అప్పడు బేడీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ గా ఉన్నారు. ఇది జరిగిన ఏడేళ్ల తర్వాత అంటే 1982లో ఇందిర కారుకు ఫైన్ విధించిన ఘటన జరిగింది.